ap7am logo

కల్పనారాయ్ కి మిగిలింది కన్నీళ్లే!

Tue, Jun 23, 2015
కల్పనారాయ్
కల్పనారాయ్
ప్రతి ఒక్కరి జీవితంలోను కష్టసుఖాలు వుంటాయి. ఎవరైనా కష్టాల్లో కనిపిస్తే 'అయ్యో' అనుకుంటూ వుంటారు .. వీలైతే సాయం చేస్తూ వుంటారు. అదే తెరపై కనిపించే నటీనటులు కష్టాల్లో వుంటే కలిగే బాధ ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే, నటీనటులను తమ కుటుంబ సభ్యులుగా అభిమానులు భావిస్తుంటారు. అలా అభిమానులచే కన్నీళ్లు పెట్టించిన నటి 'కల్పనారాయ్'.

వెండితెరపై నవ్వులు కురిపించినవారిలో కొంతమంది జీవితాలు కన్నీటి కథలుగానే ముగిసిపోయాయి. అలాంటి కథగా మారిపోయినదిగా కల్పనా రాయ్ జీవితం కనిపిస్తుంది. రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన కల్పనా రాయ్, గోదావరి యాసతో మాట్లాడుతూ ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టింది. తనదైన మేనరిజంతో హాస్యనటిగా ప్రత్యేకమైన ముద్ర వేసింది. తమ సినిమాల్లో కల్పనా రాయ్ కి వేషం ఉండాల్సిందే అన్నట్టుగా ఆమె ప్రతి సినిమాలోనూ కనిపించేది.

సినిమాల్లో తాను ధరించిన పాత్రల్లో మాదిరిగానే కల్పనా రాయ్ కల్మషం తెలియని మనిషి. అందుకే వందల సంఖ్యలో వచ్చిన అవకాశాలను అధిక మొత్తంలో డబ్బుగా మార్చుకోలేకపోయింది. ఫలితంగా అవకాశాలు లేని రోజున డబ్బు కూడా లేకుండా పోయింది. వయసు అనుభవం తెచ్చినా తేకపోయినా అనారోగ్యాన్ని మాత్రం తెస్తుంది. అలా అనారోగ్యం బారినపడిన కల్పనా రాయ్, ఆర్థికపరమైన ఇబ్బందులతోనే కాలాన్ని నెట్టుకొచ్చింది.

ఆమె ఆవేదనని కొంతమంది పట్టించుకోనే లేదు. మరికొంతమంది పట్టించుకున్నా పూర్తిస్థాయిలో ఆమెని ఆదుకోలేకపోయారు. అంతగా బాధలు పడుతూ కూడా తన కష్టం మరెవరికీ రాకూడదనే పెద్దమనసును చాటుకుంటూ, ఇక తన కన్నీళ్లు కనిపించనీయడం ఇష్టం లేక కళ్లు మూసుకుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Related News
Movie News (Latest)