ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

2014లో మురిపించిన సినిమాలు!

Wed, Dec 31, 2014
మన దేశంలో టాలీవుడ్ కి ప్రత్యేకత వుంది. మార్కెట్ పరంగా, విస్తృతి పరంగా అగ్రతాంబూలం బాలీవుడ్ దే అయినప్పటికీ, చిత్ర నిర్మాణ సంఖ్యాపరంగా తెలుగు సినిమా ముందుంటుంది. ప్రతి ఏడాదీ వేలాదికోట్ల రూపాయల పెట్టుబడి టాలీవుడ్ లోకి ప్రవాహంలా వస్తుంది. అలాగే వేలాది కుటుంబాలు టాలీవుడ్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అందుకే, ఈ వినోదపరిశ్రమ దేశంలో ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తుంది.

2014లో కూడా టాలీవుడ్ సంఖ్యాపరంగా తన ప్రాధాన్యతను నిలబెట్టుకుంది. తెలుగులో 193 స్ట్రెయిట్ చిత్రాలు నిర్మాణం జరుపుకుని, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటికి 82 అనువాద చిత్రాలు తోడయ్యాయి. అంటే మొత్తం 275 తెలుగు సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వచ్చాయి. అయితే, ప్రేక్షకులను అలరించి హిట్స్ అనిపించుకున్నవి షరా మామూలుగా తక్కువగానే వుండగా, బాక్సాఫీసు వద్ద పేలిపోయి ఫట్స్ అయినవే ఎక్కువగా వున్నాయి. అటూ ఇటూ కాకుండా ఏవరేజ్ అనిపించుకున్నవీ కొన్ని వున్నాయి. ఆ విజయాలను ఒకసారి ముచ్చటించుకుంటే...

ఈ ఏడాది భారీ విజయాన్ని నమోదు చేసిన చిత్రంగా ముందుగా 'రేసుగుర్రం' చిత్రాన్ని చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపిందనే చెప్పాలి. వినోదమే ప్రధానంగా సాగిన ఈ చిత్రం సుమారు 57 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అగ్రపీఠాన్ని అధిష్ఠించింది. బన్నీ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవగా ... టాలీవుడ్ చరిత్రలో నాలుగో స్థానాన్ని దక్కించుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మరో చిత్రంగా బాలకృష్ణ నటించిన 'లెజండ్' చిత్రాన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అభినయం పరంగా బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ నే కాకుండా, క్లాస్ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. 275 రోజుల ప్రదర్శన కూడా రెండు చోట్ల పూర్తి చేసుకుంది. 50 కోట్ల క్లబ్బులో చేరిన బాలయ్య తొలిసినిమా గా ఇది రికార్డులకెక్కింది!

రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'ఎవడు' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్ పోషించడం సినిమాకి ప్లస్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించిన ఈ చిత్రం 47 కోట్లు వసూలు చేసి, నిర్మాతకు లాభాల పంట పండించింది.

కమర్షియల్ పంథాలో సాగుతూనే, తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచి చూపించిన చిత్రంగా 'మనం' సినిమా ప్రశంసలందుకుంది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు నటించిన ఈ చిత్రం పునర్జన్మల ఇతివృత్తంతో రూపొందింది. దర్శకుడు విక్రంకుమార్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీసు వద్ద ఇది సుమారు 35 కోట్లు వసూలు చేసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక వెంకటేష్ నటించిన 'దృశ్యం' మరో కొత్తదనాన్ని ఆవిష్కరించింది. మలయాళంలో వచ్చిన 'దృశ్యం' చిత్రానికి ఇది రీమేక్. అయినప్పటికీ, కథ సాగే తీరు మన ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. సుమారు 20 కోట్లు కలెక్ట్ చేసి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. అపజయాల్లో వున్న వెంకీకి మళ్లీ జీవం ఇచ్చిన చిత్రమిది.

రవితేజ నటించిన 'పవర్' సినిమా కూడా హిట్ సినిమాగా నిలిచింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 23 కోట్లు వసూలు చేసింది. అలాగే, 'లౌక్యం' సినిమా గోపీచంద్ కు లైఫ్ ఇచ్చింది. ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకున్న ఈ చిత్రం కూడా 20 కోట్ల వరకు వసూలు చేసింది. అలాగే, 'గీతాంజలి', 'రన్ రాజా రన్', 'కార్తికేయ', 'హార్ట్ ఎటాక్', 'ఊహలు గుసగుసలాడే' చిత్రాలు కూడా తమ స్థాయిలో విజయాలు నమోదు చేసుకున్నాయి. రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీసు వద్ద మాత్రం ఏవరేజ్ గానే నిలిచింది. ఇలా ఏవరేజ్ గా నిలబడ్డ చిత్రాలు మరికొన్ని కూడా వున్నాయి.

ఇక మహేష్ బాబుకి ఈ ఏడాది అస్సలు కలసి రాలేదనే చెప్పాలి. ఆయన నటించిన 'నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా దెబ్బతిని, అపజయాలు మూటగట్టుకున్నాయి. గతేడాది 'అత్తారింటికి దారేది' వంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆ విధంగా అభిమానులను నిరాశపరచాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది నటించిన ఒకే ఒక్క చిత్రం 'రభస' ఫ్లాప్ చిత్రంగా పేరు తెచ్చుకుని ప్రేక్షకులను అలరించలేకపోయింది.

మొత్తానికి విజయాలు, అపజయాల నిష్పత్తి మాత్రం ఎప్పటిలానే ఈ ఏడాది కూడా కొనసాగింది. కేవలం కొత్తదనం ఉంటేనే సినిమా చూస్తామన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మరోసారి చెప్పకనే చెప్పారు. సినిమాలో మంచి కథ, కథనం, కొత్తదనం లేకుండా కేవలం భారీ తారాగణం, భారీ సెట్స్, భారీ లొకేషన్స్... వంటి వాటిని నమ్ముకుని, కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే అది కేవలం శవానికి అలంకరణ చేసినట్టు మాత్రమే అవుతుందన్న విషయం మరోసారి తేటతెల్లం అయింది!

X

Feedback Form

Your IP address: 67.225.212.107
Movie News (Latest)