ap7am logo

కరక చతుర్థి వ్రతం

Thu, Oct 31, 2013, 03:25 PM
Related Image స్త్రీలకు సౌభాగ్యానికి మించిన సంపదలేదు. తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసమే వాళ్లు పూజలు ... నోములు ... వ్రతాలు చేస్తుంటారు. ఈ నోములు - వ్రతాలు కార్తీక మాసంలో చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దాంతో ఈ మాసమంతా స్త్రీలు నోములతో .. వ్రతాలతో తీరికలేకుండా వుంటారు.

ఈ నేపథ్యంలో వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సుస్థిరం చేసేందుకు గాను చేసే వ్రతాల్లో 'కరక చతుర్థి' వ్రతం ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. 'కార్తీక బహుళ చతుర్థి' ని కరక చతుర్థి అంటూవుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించాలి. పూజా మందిరంలో శివపార్వతుల చిత్రపటాలను గానీ ప్రతిమలను గాని సిద్ధం చేసుకోవాలి.

ముందుగా గణపతిని ... ఆ తరువాత శివపార్వతులను ఆరాధించాలి. తమ సౌభాగ్యాన్ని సుస్థిరం చేయమని ఆదిదంపతులను కోరుకోవాలి. ముఖ్యంగా బెల్లంతో కలిపిన నువ్వులను ... లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. మిగతా పిండివంటలు ఏవి చేసినా 13 సంఖ్యలో నివేదన చేయాలి. ఓ బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. చంద్రోదయం అయిన తరువాత దీపారాధన చేసి నైవేద్యాలు సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉంటూ ... ఆ రాత్రంతా జాగరణ చేయాలి.

మరునాడు ఉదయాన్నే పునఃపూజ పూర్తిచేసి ఉద్యాపన చెప్పుకుని ... ఆ తరువాతనే ఆహారం తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఎన్ని సంవత్సరాలపాటు చేసి ఎప్పుడు ఉద్యాపన చెప్పాలనుకుంటున్నది ముందుగానే అనుకోవాలి. ఈ విధమైన నియమనిష్టలను పాటిస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేయడం వలన, ఆదిదంపతుల అనుగ్రహం లభిస్తుంది ... ఆశించిన సౌభాగ్యం సుస్థిరమై ఆనందాన్నిస్తుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy