ap7am logo

స్వయంభువు శ్రీనివాస క్షేత్రం

Thu, Oct 24, 2013, 11:43 AM
Related Image తిరుమలలోని శ్రీనివాసుడిని బాలాజీ అనీ వేంకటేశ్వరస్వామి అని పిలుస్తూ వుంటారు. అయితే హైదరాబాదు - అల్వాల్ లోని శ్రీనివాసుడిని 'బాలాజీ వేంకటేశ్వరస్వామి' గా కొలుస్తుంటారు. ఈ విధంగా స్వామివారిని కలిపి పిలవడానికి కారణం లేకపోలేదు. బాలాజీ అనే భక్తుడు స్వామివారి స్వయంభువును ప్రతిష్ఠించడం వలన స్వామిని ఈ విధంగా పిలుస్తుంటారు.

పవిత్రమూ మహిమాన్వితము అయిన ఈ క్షేత్రం, భక్తుల పాలిట కల్పతరువులా దర్శనమిస్తుంది. పూర్వం తిరుమల నుంచి కాశీకి బయలుదేరిన బాలాజీ అనే భక్తుడు, ఈ ప్రదేశంలో విశ్రమించినప్పుడు వేంకటేశ్వరస్వామి విగ్రహం కంటపడిందట. అంతకు పూర్వమే ఆ విగ్రహం మహర్షుల వలన పూజలందుకుందని ఆయన గ్రహించాడు. స్థానికుల సహాయ సహకారాలతో ఆయన ఆ విగ్రహాన్ని చిన్న మందిరంలో ప్రతిష్ఠించాడు.

ఆ తరువాత రాజా చందూలాల్ బహదూర్ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, ఆలయాన్ని అభివృద్ధి చేయమంటూ అశరీరవాణి వినిపించిందట. దాంతో ఆయన ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాడు. ఇక్కడి వేంకటేశ్వరుడు మహిమాన్వితుడు కావడం వలన, భక్తులకు కోరిన వరాలు లభిస్తూ వుంటాయి.

గర్భాలయంలో స్వామివారు ... ఆ పక్కనే గల మందిరంలో గోదాదేవి పూజలందుకుంటూ వుంటారు. ఉగాది ... శ్రీరామనవమి ... దసరా నవరాత్రులలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తుంటారు. ఇక ధనుర్మాసంలోను ... మార్గాశిరమాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లోను భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. ఆ స్వామి సేవాభాగ్యంలో మనసారా తరిస్తుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy