ap7am logo

శ్రీ అక్కమాంబ క్షేత్రం

Tue, Oct 22, 2013, 10:08 AM
Related Image ప్రతి గ్రామానికి ఓ దేవత రక్షణగా వుంటుంది. ఆ దేవత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి అంశతో అవతరించినదై వుంటుంది. గ్రామస్తులంతా ఆ దేవతను తమ తల్లిగా భావిస్తుంటారు ... అనురాగంతో ఆరాధిస్తుంటారు. గ్రామాల్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా, అంటు వ్యాధులు విరుచుకుపడకుండా, గ్రామస్తులు ప్రమాదాలకి గురికాకుండా ఈ తల్లి కాపాడుతూ ఉంటుందని విశ్వసిస్తూ వుంటారు.

తమ వెంటే ఉంటూ తమని రక్షిస్తూ వుండే ఈ తల్లికి గ్రామస్తులు ఎలాంటి లోటూ రానీయకుండా చూసుకుంటూ వుంటారు. అమ్మవారి సంతోషానికి గాను ... ఆమె బిడ్డలంతా కలిసికట్టుగా వున్నారని చెప్పడానికి గాను జాతరలు జరుపుతుంటారు ... సంబరాలు చేస్తుంటారు. అలా 'అక్కమాంబ' పేరుతో భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం, అనంతపురం జిల్లా 'కళ్యాణదుర్గం' లో దర్శనమిస్తుంది.

పూర్వం ఈ ప్రాంతం 'కళ్యాణప్ప' అనే పాలెగాడి ఏలుబడిలో వున్నకారణంగా ఈ ఊరికి కళ్యాణదుర్గం అనే పేరు వచ్చినట్టు చెబుతారు. అమ్మవారి మూలమూర్తి ప్రాచీనకాలానికి చెందినది. ఆ తరువాత కాలంలో నిర్మించబడిన ఆలయమే ఇప్పుడు కనిపిస్తున్నది. కొండ పాదభాగంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు నిలయంగా అనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో అమ్మవారు ఏకమూర్తిగా కాకుండా, సప్త మాత్రుకలుగా ఏడు రూపాల్లో కనిపిస్తూ వుంటుంది.

ఆలయ ప్రాంగణంలో ఏడు ఊయలలు ఏర్పాటుచేయబడి వుంటాయి. మనసులోని కోరిక అమ్మవారికి చెప్పుకుంటూ ఊయల ఊపడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. సంపద .. సంతానం .. సౌభాగ్యమును ఆశించే భక్తులు ఈ వరాల ఊయలను ఊపుతుంటారు. ఇదే ప్రాంగణంలో మహా శివుడి ఆలయం .. నాగదేవత ఆలయం దర్శనమిస్తాయి. ప్రతి మంగళ .. శుక్రవారాల్లో భక్తులు అమ్మవారి ఆలయానికి ఎక్కువగా వస్తూ వుంటారు.

విశేషమైన పుణ్య తిథుల్లో ప్రత్యేక అలంకరణలు ... పూజలు జరుపుతుంటారు. ఈ ప్రాంతవాసులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావిస్తూ, ఏ శుభకార్యమైనా ఆమె ఆశీస్సులు తీసుకునే ఆరంభిస్తారు. నిరంతరం ఆ తల్లిని సేవిస్తూ ... ఆమె పూజలో పునీతులవుతుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy