ap7am logo

మంగళసూత్రానికి నల్లపూసలు

Fri, Sep 13, 2013, 12:49 PM
Related Image సహజంగానే స్త్రీలకి వివిధ రకాల ఆభరణాలపై ఆసక్తి ఎక్కువగా వుంటుంది. కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు ఆయా రకాల ఆభరణాల పట్ల మక్కువ పెంచుకుంటారు. లేదంటే 'నల్లపూసల తాడు'తోనే సరిపెట్టుకుంటారు. స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా ... పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.

అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy