ap7am logo

మంటాడ వేంకటేశ్వరుడు

Tue, Sep 03, 2013, 04:38 PM
Related Image అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం ... నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది ... ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా 'మంటాడ'లో దర్శనమిస్తుంది.

ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి - భూదేవి సమేతంగా కొలువైకనిపిస్తాడు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహాలు సుందరంగా ... సుకుమారంగా కనిపిస్తూ భక్తుల హృదయాలను కొల్లగొడుతూ వుంటాయి. ఇక్కడి స్వామివారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు'గా భక్తులు కొలుస్తుంటారు. వివాహం విషయంలో ఆటంకాలు ఎదుర్కుంటున్న వారు మూడు శుక్రవారాల పాటు స్వామివారికి అభిషేకాలు చేయిస్తుంటారు.

ఈ విధంగా చేయడం వలన వెంటనే అ సమస్య పరిష్కరించబడుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఈ కారణంగా శుక్రవారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. ఇక అన్నప్రాసనలు ... అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఇదే ప్రాంగణంలో రాజ్యలక్ష్మీ దేవి ... సంతాన నాగేశ్వరస్వామి పూజలు అందుకుంటూ వుంటారు. దసరా నవరాత్రులలో రాజ్యలక్ష్మీ అమ్మవారిని నవదుర్గా రూపాల్లో అలంకరించి పూజిస్తుంటారు.

ఇక ఈ క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించిన రోజుని పురస్కరించుకుని, వైశాఖ మాసంలో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని సేవించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కళ్యాణ వేంకటేశ్వరుడికి పూలు ... పండ్లు ... కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy