ap7am logo

శ్రీ హనుమాన్ క్షేత్రం

Thu, Aug 29, 2013, 12:42 PM
Related Image శ్రీరాముడి ప్రేమను ... సీతమ్మవారి అభిమానాన్ని పొందిన వానరవీరుడు హనుమంతుడు. సాక్షాత్తు లక్ష్మీ నారాయణులే సీతారాములని నమ్మిన హనుమంతుడు వారి సేవలో తరించి చిరంజీవిగా నిలిచిపోయాడు. భక్తాగ్రేసరుడిగా చరిత్రలో నిలిచిపోయిన హనుమంతుడు, తన పాద ధూళిచే అనేక ప్రాంతాలను పవిత్ర క్షేత్రాలుగా మార్చాడు. అలాంటి వాటి జాబితాలో ఒకటిగా హైదరాబాద్ - షేక్ పేట్ మనకి దర్శనమిస్తుంది.

ఇక్కడి హనుమంతుడు స్వయంభువుగా ఆవిర్భవించాడు. జైమినీ మహర్షి తన యాగ సంరక్షణార్థం హనుమంతుడిని ప్రార్ధించగా ఆయన ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రాంతం అరణ్యాన్ని తలపిస్తూ వుండేది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకున్న పాదచారులకు ఆయన విగ్రహం కనిపించిందట. ఈ విషయం తెలుసుకున్న దగ్గరలోని గ్రామస్తులు, చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి అందులో స్వామివారిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు.

కాలక్రమంలో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడం ... స్వామి మందిరం శిధిలం కావడం జరిగాయి. అప్పుడు ఒక భక్తుడు ఇక్కడి స్వామివారికి విశాలమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆ రోజు నుంచి హనుమంతుడితో పాటు ఈ ప్రాంగణంలో శివాలయం ... అయ్యప్పస్వామి ఆలయం ... సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... గణపతి మందిరం ... నవగ్రహ మంటపం కొలువుదీరాయి. ఇక్కడి హనుమంతుడిని దర్శించడం వలన గ్రహ సంబంధమైన దోషాల నుంచి బయట పడవచ్చని భక్తులు విశ్వసిస్తుంటారు.

వివిధ దేవతా మూర్తులు కొలువైన కారణంగా ఆయా పుణ్య తిథుల్లో వారికి ప్రత్యేక పూజాభిషేకాలు జరుగుతుంటాయి. హనుమజ్జయంతి ... మహా శివరాత్రి ... వినాయక చవితి ... సుబ్రహ్మణ్య షష్ఠి ... సంక్రాంతి వంటి పర్వదినాల సమయాల్లో ఆయా దేవతా మూర్తులకు విశేష పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు ... ప్రధాన దైవంతో పాటు ఉపాలయాలను దర్శించి తరిస్తుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy