ap7am logo

వినాయక చవితి

Sat, Jul 13, 2013, 12:10 PM
Related Image వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు ... ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే ... ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా 'ఋగ్వేదం' చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను జరుపుకుంటూ వుంటారు.

పూర్వం గజముఖుడనే రాక్షసుడు పరమ శివుడిని తన తపస్సుచే మెప్పించి, ఆయన తన ఉదరంలో వుండే విధంగా వరాన్ని పొందాడు. ఈ విషయంగా పార్వతీ దేవి ఆందోళన వ్యక్తం చేయగా శ్రీ మహా విష్ణువు తరుణోపాయాన్ని గురించి ఆలోచించాడు. నంది ... గంగిరెద్దుగా, విష్ణువు - బ్రహ్మ గంగిరెద్దును ఆడించు వారిగా ఆ రాక్షసుడి నివాస ప్రాంతానికి చేరుకున్నారు. గజముఖుడి ఎదుట గంగిరెద్దును చిత్ర విచిత్రములుగా ఆడించారు.

అందుకు సంతోషించిన గజముఖుడు ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అతని కడుపులో గల శివుడిని ప్రసాదించమని వారు కోరడంతో, వచ్చిన వారు ఎవరనేది గజముఖుడికి అర్థమైపోయింది. దాంతో తన శిరస్సు పరమ పూజనీయం కావాలనీ ... తన చర్మం శివుడు ధరించాలనే వరాలను కోరిన గజముఖుడు, శివుడిని వారికి అప్పగించి ప్రాణాలు వదిలాడు.

కైలాసంలోని పార్వతీ ... శివుడి కోసం ఎదురు చూస్తూనే నలుగుపిండితో స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా వుంచి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ... ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంచే ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది.

దాంతో శివుడు ... గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడి దేహభాగానికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. ఆ బాలకుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి గణాధిపతిని చేశాడు. అలాంటి గణపతి నడవడానికి పడుతున్న అవస్థను చూసి శివుడి శిరస్సున గల చంద్రుడు నవ్వాడు. దాంతో ఆ రోజున (భాద్రపద శుద్ధ చవితి) ఎవరైతే చంద్రుడిని చూస్తారో ... వారు నీలాపనిందలను ఎదుర్కుంటారని గణపతి శపించాడు. అంతా కలిసి వినాయకుడికి నచ్చజెప్పడంతో, ఆ రోజున తన కథ చెప్పుకుని అక్షింతలు తలపై ధరించిన వారికి ఈ శాపం వర్తించదని చెప్పాడు.

ఇక పాల పాత్రలో ఆ రోజున చంద్రుడిని చూసినందుకు గాను శ్రీ కృష్ణుడంతటి వాడుకూడా నీలాపనిందలను మోయవలసి వచ్చింది. ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు ... మానవులు ఈ రోజున వినాయకుడిని పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించసాగారు. ఆ రోజు నుంచి గణ నాయకుడిగా ... విద్యా .. విజ్ఞాలను ప్రసాదించే అధినాయకుడిగా వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. తన భక్తులు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహిస్తున్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy