కష్టాలను గట్టెక్కించే వేంకటేశ్వరుడు
Mon, Jul 04, 2016, 09:14 AM

ఇక్కడ స్వామివారు కొండపై కొలువైన కారణంగా కొండమల్లేపల్లి అని కూడా పిలుస్తుంటారు. దేవరకొండకి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఓ భక్తుడు ఈ కొండపై స్వామివారి ఆలయాన్ని రాజగోపురంతో సహా నిర్మించి, నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు. కొండపైకి చేరుకోవడానికి మెట్లదారి .. ఘాట్ రోడ్ రెండూ వున్నాయి. కొండ దిగువున గల హనుమంతుడిని దర్శించుకుని భక్తులు కొండపైకి చేరుకుంటారు.
గర్భాలయంలో స్వామి నిలువెత్తున .. నిండుగా దర్శనమిస్తూ ఉంటాడు. ప్రత్యేక మందిరాల్లో అమ్మవార్లు కొలువై దర్శనమిస్తూ వుంటారు. స్వామివారి రూపం దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది. సుందరమైన ఆయన రూపాన్ని చూస్తూ అలాగే నుంచుండిపోవాలనిపిస్తుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన కష్టాల నుంచి వెంటనే బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే.