ap7am logo

లక్ష వత్తుల నోము

Thu, Jun 27, 2013, 06:48 PM
Related Image ఆచార వ్యవహారాలకు లోబడే ఆధ్యాత్మిక జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ దైనందిన జీవితంలో తెలిసో తెలియకో కొన్ని పాపాలకు కారకులవుతుంటారు. అలాంటి వారికి వరంలా లభించిన వ్రతమే 'లక్ష వత్తుల నోము'. ఈ నోము చాతుర్మాస్యంలో చేయడం వలన విశేష ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది.

వెయ్యి నారాయణ గాయత్రి మంత్రంతో ... పరమాన్నంతో ... నెయ్యితో హోమం చెయ్యాలి. ఆ తరువాత పీఠంపై కలశ స్థాపనచేసి ... వస్త్రంపై లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి ఆవాహన చేయాలి. బంగారపు వత్తి ... వెండి వత్తి ... పత్తితో చేసిన లక్ష వత్తులతో ఆవు నెయ్యితో మహాదీపారాధన చేయాలి. షోడశోపచార పూజ అనంతరం రాత్రంతా జాగారం చేసి మరుసటి ఉదయం పునః పూజ చేసి బ్రాహ్మణుడికి వస్త్ర సహితమైన మంటపాన్ని దానమివ్వాలి.

ఇక ఈ నోము ఎంతటి మహిమాన్వితమైనదో తెలిపే కథ ఒకటి ప్రచారంలో వుంది. ఒక ఊళ్లో లక్షణ అనే ఓ వేశ్య వుండేది. ఒకరోజున ఆమె కాలక్షేపం కోసం ఊళ్లోకి వెళ్లగా భర్త శవం పక్కన కూర్చుని రోదిస్తోన్న ఓ బ్రాహ్మణ స్త్రీ కనిపించింది. ఓ కులస్త్రీ అంతగా విచారిస్తూ వుండటం లక్షణకి బాధ కలిగించడంతో, ఆమెకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ఓ బ్రాహ్మణ శ్రేష్టుడిని అడిగింది. తెలిసి తెలియక చేసే పనుల వలన పాపాలు సంక్రమిస్తాయనీ, అలాంటి పాపాలను హరించే శక్తి లక్ష వత్తుల నోముకి వుందని చెప్పాడు.

ఆమె నమ్మలేనట్టుగా చూడటంతో, అంత అనుమానగా వుంటే వెంటనే ఆ వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని ఆ బ్రాహ్మణ స్త్రీకి ధారపోసి చూడమని చెప్పాడతను. ఆయన చెప్పినట్టుగానే లక్షణ వెంటనే ఆ వ్రతాన్ని ఆచరించి వచ్చి దాని ఫలితాన్ని భర్త శవం దగ్గర రోదిస్తోన్న బ్రాహ్మణ స్త్రీకి ధారపోసింది. ఫలితంగా చనిపోయిన ఆమె భర్త వెంటనే పునర్జీవితుడయ్యాడు. ఆనాటి నుంచి స్త్రీలు మరింత శ్రద్ధగా ఈ వ్రతాన్ని చేసుకోవడం ప్రారంభించినట్టు ఈ కథ చెబుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy