ap7am logo

ఉగాది

Thu, Jun 27, 2013, 05:05 PM
Related Image ఉగాది (యుగాది)అంటే యుగం ఆరంభించబడిన రోజు అని అర్ధం. ఒక ప్రళయం అనంతరం తిరిగి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తాడు. అలా ఈ యుగానికి సంబంధించిన సృష్టిని ఆయన 'చైత్ర శుద్ధ పాడ్యమి' రోజున ప్రారంభించాడు. ఫల పుష్పాదులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రపంచానికి పరిచయమవుతూ వుంటాయి. పిందెలతో మామిడి చెట్లు ... పూతతో వేపచెట్లు ... కొత్త గెలలతో కొబ్బరి చెట్లు ... ఇలా సమస్త ప్రకృతి అంతా కూడా తనని తాను ఆవిష్కరించుకుంటూ వుంటుంది.

ప్రకృతి తనకి తానుగా మనకి తొలిసారిగా అందిస్తోన్న ఈ ఫల పుష్పాదులను, కృతజ్ఞతా పూర్వకంగా భగవంతుడికి నివేదించి దానిని ప్రసాదంగా తీసుకోవడం తరతరాలుగా వస్తోంది. భారతీయుల జీవన విధానంలో ఆరు రుచులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందువలన ఆరు రుచులు ( తీపి .. చేదు .. పులుపు .. ఉప్పు .. వగరు .. కారం ) ప్రకృతి నుంచి స్వీకరించి వాటి మిశ్రమాన్ని పచ్చడిగా చేస్తారు. ఇది 'ఉగాది పచ్చడి' పేరుతో ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను కూడా సమపాళ్లలో స్వీకరించడానికి సిద్ధంగా ఉండమనే సంకేతాన్ని ఈ ప్రసాదం ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు.

ఇక ప్రకృతి మాత అందించిన ఈ తొలి ప్రసాదాన్ని స్వీకరించడం వలన, ఆరోగ్యపరమైన సమస్యలనుంచి దూరంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా కళకళలాడుతూ వున్న ప్రకృతి పై నుంచి వచ్చే గాలి కూడా ఆనందానుభూతులతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రకృతిమాత నుంచి ఈ వరాన్ని అందుకోవాలంటే, ఉదయాన్నే తల స్నానం చేసి ... సంప్రదాయబద్ధమైన కొత్త బట్టలు ధరించి ... దైవారాధన చేయాలి. ఆ తరువాతనే ప్రకృతి మాతకు నమస్కరించి, ఫల పుష్పాదులను గ్రహించాలి.

ఈ సృష్టిలో ప్రతి పుష్పం పూసేది ... ప్రతి ఫలం కాసేది దైవం కోసమేననే విషయాన్ని గుర్తుంచుకుని, వినయ పూర్వకంగా ... భక్తి ప్రపత్తులతో ఆ పని చేయాలి. ఆ తరువాత తయారు చేసిన 'ఉగాది పచ్చడి'ని ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టి ... దానిని ప్రసాదంగా తీసుకోవాలి. ఆ రోజు సాయంత్రం దగ్గరలోని గుళ్ళోకి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అక్కడ జరిగే 'పంచాంగ శ్రవణం' కార్యక్రమంలో పాల్గొనాలి.

తిథి -వార-నక్షత్ర - కరణ - యోగాములను 'పంచాంగం' అంటారు. 'తిథి' వలన సంపద ... 'వారం' వలన ఆయువు వృద్ధి అవుతుంది. ఇక 'నక్షత్రం' వలన పాపాలు ... 'యోగం' వలన వ్యాధులు నశిస్తాయి. 'కరణం' వలన కార్య సిద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. మన తెలుగు సంవత్సరాలు ... 60. 'ప్రభవ' నుంచి మొదలై 'అక్షయ' నామ సంవత్సరం వరకూ జరుపుకుంటాం. ఆ తరువాత ఇవే పునరావృతమవుతూ ఉంటాయి.

అందువలన ప్రతి నూతన సంవత్సరంలో దేశ కాలమాన పరిస్థితులు ... తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కొత్త ఏడాదిలోని తొలి తొమ్మిది రోజులు మహా పవిత్రమైనవి కావడంతో, ఈ రోజు నుంచే వసంత నవరాత్రులను ప్రారంభిస్తారు. ఈ తొమ్మిది రోజులూ వైష్ణవీ దేవిని ... ఈ శక్తికి పురుష రూపుడైన శ్రీరాముడిని ఆరాధిస్తే సకల శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ తొమ్మిది రోజులు రామ నవరాత్రులు ... నిర్వహించబడుతుంటాయి.

ఈ తొమ్మిది రోజులు ఒక్కోరోజున ఒక్కో విశేషం వుంటుంది కాబట్టి, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఇక ఈ రోజుల్లో ఎండలు ఎక్కువగా వుంటాయి కాబట్టి, మంచినీళ్లను గాని ... నీటి పాత్రలను గాని దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అచ్చమైన తెలుగుదనం నిండుగా జరుపుకునే ఈ పండుగ, కొత్త ఊపిరిని ... ఉత్సాహాన్ని ఇస్తుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy