ap7am logo

హోలీ

Thu, Jun 27, 2013, 04:40 PM
Related Image తెలుగు పండుగలను పరిశీలిస్తే ప్రజలమధ్య సమైక్యతను ... సఖ్యతను పెంపొందించే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. సాధారణంగా దసరా ... దీపావళి ... సంక్రాంతి వంటి పండుగల విషయానికి వస్తే, ఇవి ఎవరి కుటుంబం పరిధిలో వారు జరుపుకుంటూ వుంటారు. అయితే 'హోలీ'పండుగ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ వుంటుంది. ఇళ్లలో కాకుండా వీధిలో సందడి చేయడం, అన్ని వయసుల వారిని కలుపుకుంటూ ఆటపాటలతో అలరించడం ఈ పండుగ ప్రత్యేకత.

ఈ పండుగ పట్నాల్లోనూ విహరిస్తునప్పటికీ, అది పల్లెల్లో పరుగులు తీస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరుగా వుంటుంది.'వసంతపంచమి' నుంచి 'పున్నమి' వరకూ వసంతోత్సవాలు జరుగుతాయి. ఈ రోజుల్లో స్త్రీలు చప్పట్లతోను ... పురుషులు కోలాటాలతోను ... పిల్లలు కప్పల పెళ్లిల్లు చేస్తూ జానపదగీతాలు పాడుతూ సందడి చేస్తారు. చతుర్దశి రోజు రాత్రి నాలుగు వీధుల కూడలిలో 'కామదహనం' చేస్తారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటారు.

కాముడు తిరిగి బతికిన కారణంగా ... తొలినాళ్లలో వరసైన బావామరదళ్లు మాత్రమే జరుపుకునే ఈ పండుగ, ఆ తరువాత కాలంలో అందరూ జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ కాముని పున్నమి పండుగ వెనుక కూడా పురాణం సంబంధమైన కథ ఒకటి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. దక్షయజ్ఞ వాటిక సమీపంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకోవడంతో, ఆ బాధను దిగమింగుకోవడం కోసం శివుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. సతీదేవిగా తనువు చాలించిన అమ్మవారు, హిమవంతుని కూతురు పార్వతిగా జన్మిస్తుంది. గతజన్మ వాసనల వలన ఆమె పరమేశ్వరుని అనునిత్యం పూజిస్తూ సేవలు చేస్తుంటుంది.

లోక కల్యాణం కోసం పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం జరిపించడం అవసరమని భావించిన దేవతలు ... ఆ బాధ్యతను మన్మధుడికి అప్పగిస్తారు. పార్వతి పట్ల శివుడికి ఆసక్తి కలగడం కోసం ముక్కంటి పైనే పూల బాణాన్ని సంధిస్తాడు మన్మధుడు. క్షణ కాలంపాటు కామ వికారానికి లోనైన శంకరుడు, అందుకు కారకుడైన మన్మధుడిపై మూడవ కన్ను తెరవడంతో అతను భస్మమైపోతాడు. విషయం తెలుసుకున్న రతీదేవి తన భర్తను సజీవుడిని చేయవలసిందిగా కన్నీళ్లతో పరమేశ్వరుడిని కోరుతుంది.

పార్వతీ దేవి కూడా నచ్చజెప్పడంతో మన్మధుడు అశరీరుడై సజీవంగా ఉండునట్లు ఆదిదేవుడు అనుగ్రహిస్తాడు. ఫాల్గుణ పౌర్ణమి రోజున జరిగిన ఈ సంఘటన నేపథ్యంలోనే 'కాముని పున్నమి'ని జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఇక ఇదే రోజున 'హోలికా' అనే రాక్షసి అంతమైన కారణంగా,'హోలీ'అనే పేరుతో ఈ పండుగ ప్రసిద్ధిచెందింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy