సర్పదోషాన్ని నివారించే నాగపూజ
Fri, Aug 14, 2015, 08:08 AM

పరమపవిత్రమైన ఈ మాసంలో పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు .. విదియ రోజున నారాయణుడు .. తదియ రోజున పార్వతీదేవి .. చవితి రోజున వినాయకుడు పూజించబడుతుంటారు. ఇక ఈ చవితిని 'నాగుల చవితి' అని కూడా పిలుస్తుంటారు .. ఆ తరువాత రోజైన 'నాగపంచమి'న కూడా నాగదేవతలను సేవిస్తుంటారు.
'నాగులచవితి' రోజున తలస్నానం చేసి .. ఉపవాస దీక్షను చేపట్టాలి. దగ్గరలోని ఆలయాల్లో విగ్రహరూపంలో వున్న నాగదేవతకి పూజాభిషేకాలు నిర్వహించాలి. లేదంటే పుట్ట దగ్గరికి వెళ్లి పూలతో దానిని అలంకరించి పూజించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించి, నువ్వుల పిండితో చేసిన చలిమిడిని .. వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి.
పుట్ట మట్టిని కొద్దిగా తీసుకుని కంటి పై భాగానికి .. చెవి కొసలకు రాసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చర్మ సంబంధమైన వ్యాధులు దరిచేరవని చెప్పబడుతోంది. నాగదేవతను పూజించడం వలన సర్ప భయాలు .. సర్ప దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది.