ap7am logo

తొలి ఏకాదశి

Wed, Jun 26, 2013, 03:34 PM
Related Image ఆషాఢ శుద్ధ ఏకాదశిని 'తొలి ఏకాదశి'గా ... 'శయన ఏకాదశి'గా పిలుస్తుంటారు. శ్రీ మహా విష్ణువు ఆ రోజు నుంచి 'కార్తీక శుద్ధ ఏకాదశి' వరకూ యోగ నిద్రలో ఉంటాడు. అందువల్లనే సాధు సత్తములు ఈ నాలుగు నెలల పాటు అంటే శ్రీ హరి తిరిగి మేల్కొనేంత వరకూ ప్రయాణాలు మానుకుని, స్థిరమైన జీవితాన్ని కొనసాగిస్తూ 'చాతుర్మాస్య వ్రతం' చేస్తుంటారు.

పూర్వకాలంలో తొలి ఏకాదశినే నూతన సంవత్సర ఆరంభంగా భావించే వారు. అందువలన ఆ రోజున అందరూ కూడా 'గోపద్మ వ్రతం'ఆచరించేవారు. గోవును సకలదైవ స్వరూపంగా భావించేవారు కాబట్టి, ఏడాది ప్రారంభంలో గోవును పూజిస్తే సర్వ దైవాలను పూజించిన ఫలితం లభిస్తుందని ఇలా చేసేవారు.

గోవు ముఖము నందు వేదాలు .. నుదుటున శివుడు .. దిగువ భాగంలో గంధర్వులు .. కంటి భాగాలలో సూర్య చంద్రులు .. కొమ్ముల చివరన ఇంద్రుడు .. చెవుల యందు అశ్వనీ దేవతలు .. దంతములందు గరత్మంతుడు .. గోవు మూపురాన బ్రహ్మ .. మెడకి దగ్గరగా విష్ణువు .. పూర్వ భాగమందు యముడు .. పశ్చిమ భాగమందు అగ్ని .. దక్షణ భాగమున వరుణ - కుబేరులు, వామ భాగమునందు యక్షులు .. గోవు ఆపానంబున గంగాతీర్థం .. గోమయంలో లక్ష్మీదేవి .. గోవు పొదుగునందు చతుస్సాగరములు నెలకొని వున్నాయని బ్రాహ్మాండ పురాణంలో చెప్పబడింది.

ఈ కారణంగానే తొలి ఏకాదశి రోజున గోశాలను శుభ్రంగా అలికి గోమాతలను అందంగా అలంకరించి పసుపు కుంకుమలతో పూజించాలి. ఇందువలన కోరిన కోరికలు నెరవేరి, సకల సంపదలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy