ap7am logo

దైవానికి కావలసింది అంకితభావమే

Fri, Apr 03, 2015, 01:31 PM
Related Image మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే వాళ్లంతా మనసును అదుపులో పెట్టుకున్నారనే విషయం అర్థమవుతుంది. తమ జీవనానికి అవసరమైనంతవరకే సంపాదించుకునేవారు ... అందులో ఏమైనా మిగిలితే అతిథుల కోసం ఖర్చు చేసేవారు. సాధారణంగా అన్ని కోరికలకు మనసే కేంద్రస్థానంగా పనిచేస్తూ వుంటుంది. కోరికలకు అంతనేది లేదు కనుక, అవి దుఃఖానికి చేరువచేస్తుంటాయి.

ఎవరైతే సంతృప్తికి దూరమవుతారో .. వాళ్లు సంతోషానికి కూడా దూరమవుతారు .. భగవంతుడి పాదాలపై దృష్టి నిలపలేకపోతారు. ఆయన పాదాలకు దూరంచేసేవేవీ తమకి అవసరం లేదని భావించడం వల్లనే మహాభక్తుల జీవితాలు చరితార్థమయ్యాయి. శివభక్తుడైన 'శిరియాళుడు' అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి అవి అమ్మేయగా వచ్చిన సొమ్ముతో సంతృప్తికరంగా జీవించేవాడు.

కట్టెలు కొడుతూ ... వాటిని మోసుకొస్తూ కూడా ఆ శివుడినే తలచుకుంటూ పాటలు పాడుకునేవాడు. తనకున్న దాంట్లోనే ఇతరులకి సాయం చేసేవాడు. ఇక 'కబీరుదాసు' బట్టలు నేస్తూనే ఆ శ్రీరాముడిని కీర్తిస్తూ ఉండేవాడు. వాటిని అమ్మేయగా వచ్చిన సొమ్ముతో అతిథుల ఆకలిని తీర్చేవాడు. ఇక 'కుమ్మరి కేశప్ప' అనే శివ భక్తుడు .. 'గోరా కుంభార్' అనే పాండురంగడి భక్తుడు .. 'భీముడు' (కురువ నంబి) అనే వేంకటేశ్వరస్వామి భక్తుడు కూడా ఈ కోవలోకే వస్తారు.

వీళ్లంతా కుండలు తయారుచేయడమనే తమ వృత్తిని సంతోషంగా కొనసాగిస్తూనే తమ ఇష్ట దైవాన్ని ఆరాధించేవారు. జీవనోపాధి కోసం కుండలు తయరుచేసి వాటిని అమ్మేయగా వచ్చిన సొమ్ముతో అవసరాలు తీర్చుకుంటూ అతిథి సేవలు చేసే వాళ్లు. తాము కష్టపడుతున్నామనే ఆలోచనని ఏ రోజున వాళ్లు దగ్గరికి రానీయలేదు. భగవంతుడి లీలావిశేషాలను తలచుకుంటూ .. పాడుకుంటూ ... పరవశించిపోతూనే తమ పనులను పూర్తి చేసుకునేవారు.

ఇతరులకు సాయం చేస్తూ ... అతిథులను సేవిస్తూ .. మూగజీవాలను ప్రేమిస్తూ .. భగవంతుడిని ఆరాధించేవారు. శ్రమకి అంకితమవుతూనే నిస్వార్థమైన ... నిర్మలమైన మనసుతో భగవంతుడిని సేవించడం వల్లనే వాళ్లంతా ఆయన ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పొందగలిగారు ... ధన్యులు కాగలిగారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy