ap7am logo

గణేశుని నోము

Wed, Jun 26, 2013, 11:31 AM
Related Image పూర్వం ఓ ఊరిలో ఓ బ్రాహ్మణ దంపతులు వుండేవారు. ఓ కూతురు ... ఓ కొడుకు సంతానం ... చీకూ చింతాలేని సంసారం. అయితే ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ ఏడుస్తూ కూర్చునేది. కారణం లేకుండానే ఆమె అలా ఏడుస్తూ వుండటం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించగా, మరి కొందరికి చిరాకును కలిగించింది. దాంతో ఆమె ఏడుపు ఆ వీధికి అరిష్టమంటూ చుట్టుపక్కల వారు హెచ్చరించడంతో, ఊరు చివరికి వెళ్లి అక్కడ ఏడుస్తూ కూర్చోసాగింది.

దాంతో ఓ వ్యక్తి ఆమె పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుని, కారణం లేకుండా ఏడిస్తే బాగుండదు గనుక, పిల్లలకి ఏదైనా హాని కలిగించి, ఆ కారణం చూపించి ఏడవమని చెప్పాడు. అసలే బోరున ఏడవాలని అనుకుంటోన్న ఆమె, అందుకు కూడా సిద్ధపడింది. అయితే ఆ ఉద్దేశంతో ఆమె చేసిన ప్రయత్నాల వల్ల పిల్లలకు మంచే జరిగింది. దాంతో మరొకరి మాట విని ఇంట్లోని పెంపుడు జంతువులకు హాని చేయడానికి ఆమె ప్రయత్నించింది. వాటికి కూడా మంచే జరగడంతో, ఎప్పటిలానే పొలిమేరల్లో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది.

భూలోక విహారం చేస్తోన్నపార్వతీ పరమేశ్వరులు అటుగా వస్తూ ఆమెను చూసి ఆగారు. ఆమె చెప్పకుండానే వారికి విషయం అర్ధమైపోయింది. క్రితం జన్మలో 'గణేషుని నోము' పట్టినందువలనే ఆమెకి ఎలాంటి లోటు లేకుండా గడుస్తోందని ఆది దంపతులు చెప్పారు. ఈ కారణంగానే ఆమె చెడు చేయబోయినా మంచి జరుగుతోందని అన్నారు. అయితే ఆ నోముని ఉల్లంఘించడం వల్లనే అకారణంగా ఆమెకి రోదించాలనిపిస్తూ ఉందని చెప్పారు. గణేశుని నోము నోచుకుంటే ఆమె సమస్య పరిష్కారమౌతుందంటూ అదృశ్యమయ్యారు. దాంతో ఆమె ఇంటికి చేరుకొని మరుసటి ఉదయాన్నే గణేశుని నోము పట్టింది.

కొత్త మట్టి మూకుడులో అయిదు గిద్దెల నూనెపోసి ... వత్తి వేసి దీపారాధన చేసింది. మానెడు మీద సోలెడు బియ్యాన్ని స్వయంపాకానికి సిద్ధం చేసింది. మూకుడు దీపాన్ని ... స్వయంపాకాన్ని శివాలయంలో నందీశ్వరుడి దగ్గరుంచి ఉద్యాపన చెప్పుకుంది. ఫలితంగా అకారణంగా ఏడవాలనే కోరిక నశించడంతో, భర్త ... పిల్లలతో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించింది. ఏడాది పాటు ప్రతి రోజు ఈ కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకుని, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకుంటే సరిపోతుందని శాస్త్రం చెబుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy