ap7am logo

స్వామి పాదం నుంచి పుట్టిన దివ్యతీర్థం

Tue, Feb 10, 2015, 04:28 PM
Related Image వెనుక జన్మల పాపాలను నశింపజేసి ముందుజన్మలకి కావలసిన పుణ్యఫలాలను అందించేవే పుణ్యక్షేత్రాలు. దేవతలు తిరుగాడినవిగా ... మహర్షుల తపోభూమిగా ... మహాభక్తులు దర్శించినవిగా పుణ్యక్షేత్రాలు కనిపిస్తుంటాయి. అలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు, సహజంగా అక్కడ ఏర్పడిన పుణ్యతీర్థాలను చూడటం కూడా జరుగుతూ వుంటుంది.

కొన్ని తీర్థాలలోని నీరు భగవంతుడి అభిషేకం కోసం మాత్రమే వాడుతుంటారు. మరికొన్ని తీర్థాలలోగల నీటిని తలపై చల్లుకోవడానికీ ... స్నానం ఆచరించడానికి అవకాశం వుంటుంది. సాధారణంగా పుణ్యక్షేత్రాలలోగల తీర్థాలు కూడా భగవంతుడి సంకల్పం కారణంగానే ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతుంటుంది. అలా భగవంతుడి సంకల్పంతో ఏర్పడిన తీర్థం మనకి ఖమ్మంలో కనిపిస్తుంది.

ఇక్కడి కొండపై స్వయంభువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం అలరారుతోంది. తెలంగాణ ప్రాంతంలో స్వయంభువుగా లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. మహర్షుల కోరికమేరకు ఇక్కడ ఆవిర్భవించిన స్వామి, తన పాదభాగంతో నేలను తట్టడంతో అక్కడి నుంచి నీరు ఉద్భవించినట్టు చెప్పబడుతోంది. స్వామివారి సేవలకి మహర్షులు ఈ నీటినే ఉపయోగించారట.

కొండపై తీర్థం ఏర్పడటమే ఒక విశేషం .. ఇక ఈ తీర్థం ఎలాంటి పరిస్థితుల్లోను ఎండిపోకపోవడం మరోవిశేషం. ఈ కారణంగానే ఇది దివ్యతీర్థమనీ, స్వామి పాదముద్ర నుంచి ఉద్భవించిన మహిమాన్విత తీర్థమని భక్తులు విశ్వసిస్తుంటారు. తీర్థంగా స్వీకరిస్తూ ... తలపై చల్లుకుంటూ భక్తులు పునీతులవుతుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy