ap7am logo

తులసి పూజ

Thu, Jun 20, 2013, 10:49 AM
Related Image సాధారణంగా రామాలయంలేని ఊరుగానీ ... తులసి మొక్కలేని ఇల్లుగాని కనిపించవు. తులసి మొక్కను అంతా పవిత్రంగా పూజిస్తుంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆరాధిస్తూ విష్ణుమూర్తి పాదాల చెంత వుంచి తరిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే తులసి అనేది మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. తులసి మొక్క మూలంలో బ్రహ్మ ... మధ్యలో విష్ణువు ... చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతున్నారు.

రామ తులసి ... కృష్ణ తులసి ... లక్ష్మీ తులసి ... కర్పూర తులసి ... వనతులసి ... శొంఠి తులసి ఇలా పలు రకాల తులసి ప్రజలకు అందుబాటులో ఉంది. కార్తీక మాసంలో తులసి మరింత పుష్పించి తన సుగంధాలను నలుదిశలా వెదజల్లుతుంది. కొందరు విశిష్టమైన మాసాల్లో తులసిని పూజిస్తే ... మరికొందరు అనునిత్యం కొలుస్తుంటారు. ఆధ్యాత్మిక పథంలో ప్రదక్షిణా పూర్వకంగా పూజలు అందుకునే తులసి, ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

తులసి వనము పై నుంచి వచ్చే గాలి కారణంగా క్రిమి కీటకాలు నశిస్తాయి. పాములు ... తేళ్లు వంటి విష కీటకాలు కూడా ఆ వైపుకు రావడానికి సాహసించవు. ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉన్నట్టయితే, ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ప్రతి నిత్యం రెండు పూటలా తులసి దళములను సేవించుట వలన, ఎన్నో రకాల వ్యాధుల బారినుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చర్మ వ్యాధులకు ... శ్వాస కోశ వ్యాధులకు తులసిని మించిన దివ్య ఔషధం లేదు.

కొన్ని వేల సంవత్సరములనాటి వైద్య గ్రంధాల్లో తులసికి వున్న ప్రాధాన్యతను ప్రస్తావించడం జరిగింది. నేటికీ ఆయుర్వేదంలో తులసి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే, మన పూర్వీకులు తులసిని ఆధ్యాత్మికతకు ముడిపెట్టి ఆచారంలో ఒక భాగం చేశారు. ఆనాటి నుంచి తులసి ఔషధ గుణాలతో పాటు భక్తిభావ పరిమళాలను కూడా వెదజల్లుతూ తన పవిత్రతను ఆవిష్కరిస్తోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy