శ్రీ మాధవేశ్వరీ దేవి
Tue, Jun 18, 2013, 05:09 PM

ఇది త్రివేణి సంగమ క్షేత్రం ... ఇక్కడ గంగా ... యమునలు ... అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంటాయి. పవిత్రమైన ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు ఎన్నో యజ్ఞాలు చేశాడనీ, ప్రజాపతి యజ్ఞాలు నిర్వహించిన ప్రదేశం కాబట్టి 'ప్రయాగ'అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.
ఇక దేవతలు ... రాక్షసులు అమృతాన్ని పొందడానికి పోటీలు పడుతున్న సమయంలో, అమృత భాండం బృహస్పతి చేతికి చిక్కింది. అది రాక్షసులకి దక్కకూడదనే ఉద్దేశంతో ఆయన దానిని తీసుకుని వెడుతుండగా, ఆ భాండంలోని అమృతం ఒలికి ఈ సంగమ క్షేత్రంలో పడిందనీ, ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'అమృత తీర్థం' అనే పేరు వచ్చిందని అంటుంటారు. ఈ క్షేత్రంలో పితృదేవతలకు ఆబ్దిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి.