ap7am logo

మడి

Fri, Jun 14, 2013, 06:15 PM
పూర్వం దైవకార్యమైనా ... శుభకార్యమైనా ... పితృ కార్యమైనా స్త్రీలు'మడి'కట్టుకుని ఎంతో శుభ్రంగా వంట చేసేవారు. తల స్నానం చేసి మడినీళ్లు పట్టుకోవడం దగ్గర నుంచి వాళ్ల పనులు మొదలయ్యేవి. ఒకప్పుడు మడి కట్టుకున్న వారు తమకి ఎవరూ తగలకుండా ఎంతో దూరంగా వుండేవారు. ఆధునిక కాలంలో చాలా మంది మడికి దూరమవుతూ వస్తున్నారు. మడి కట్టుకోవడమంటే ఏమిటో తెలియని వారు కూడా లేకపోలేదు.

నేటి కాలంలో మడి కట్టుకునే అవసరం ... అవకాశం పెద్దగా లేదని కొందరు భావిస్తున్నప్పటికీ, మడి కట్టుకునే ఆచారం వెనుక మనకి ఉపయోగపడే ఎన్నో విషయాలు లేకపోలేదు. మడి పేరుతో తల స్నానం చేయడం వలన తల వెంట్రుకలు శుభ్రం కావడమే కాకుండా, వంటచేసే సమయాల్లో ఆయా పదార్థాలలో రాలిపడే అవకాశం వుండదు. ఇక తడి బట్టలు కట్టుకోవడం వలన పొయ్యి దగ్గర వేడిని తట్టుకోవడమే కాకుండా, వస్త్రాలకు మంటలు అంటుకుంటాయనే ప్రమాద భయం లేకుండా పోతుంది.

ఇక తాము మడిలో ఉన్నామనే విషయాన్ని తడి వస్త్రాలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుండటం వలన, ఆచారంలో అపచారాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ కారణంగానే మన పూర్వీకులు 'మడి'అనే ఆచారాన్ని ఏర్పరిచి దానిని కాపాడే బాధ్యతని మనపై పెట్టారు. కాబట్టి ఈ ఆచారాల వెనుక గల అసలు అర్థాన్ని గ్రహించి, తరువాత తరాలవారికి అందించడానికి మనవంతు ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy