పాపవిమోచన ఏకాదశి ప్రత్యేకత
Mon, Apr 21, 2014, 03:35 PM

నరకంలో అమలుచేసే శిక్షలలో ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటూ పోతుంటే, భగవంతుడా ఇకపై ఒక్క పాపం కూడా చేయను అని గట్టిగా అరవాలనిపిస్తుంది. మరి చేసిన పాపాల మాటేమిటి? అనే సందేహం ఆ సమయంలోనే వస్తుంది. తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేసి వుంటాం, ఏదో ఒక పుణ్యకార్యం చేసి పాపాల కూపం నుంచి బయటపడాలని అనుకోవడం సహజం. అలాంటివారికి ఆ దేవుడు ఇచ్చిన అవకాశంగా 'పాపవిమోచన ఏకాదశి' ని చెప్పుకోవచ్చు.
చైత్ర బహుళ ఏకాదశినే పాపవిమోచన ఏకాదశి అనీ ... సౌమ్య ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని అలంకరించి, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఉపవాసదీక్షను చేపట్టి వైష్ణవ క్షేత్రాలను దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయాలి.
ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు పటాపంచలు అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఓ మహర్షి కారణంగా శాపానికి గురైన 'మంజు ఘోష' అనే అప్సరస, పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శాపం బారి నుంచి బయటపడిందని చెప్పబడుతోంది.