ap7am logo

ప్రయాణాలు (అనుకూల సంకేతాలు)

Mon, Jun 10, 2013, 09:58 PM
నేటి కాలంలో ఆధునీకత పేరుతో పాశ్చాత్య దేశాల ప్రభావం ఎంతగా ఉన్నప్పటికీ, మన సంస్కృతీ సంప్రదాయాలను ... నమ్మకాలను వదులు కోవడానికి ఎవరూ సిద్ధపడకపోవడం గమనించదగిన విషయం. వ్యాపార వ్యవహారాలే అయినా ... ఆచార వ్యవహారాలే అయినా పూర్వం నుంచి వస్తోన్న ఆనవాయతిని దాటేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం ఆనందదాయకం. అందరూ కూడా తిధి .. వార .. నక్షత్రాలను దృష్టిలో పెట్టుకుని, మంచి శకునాలను చూసుకుని తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన శకునాలను పరిశీలిస్తే వాటి ఫలితాలు ఎలావుంటాయో ... నివారణ కోసం ఏం చేయాలో అనేది స్పష్టంగా అర్ధమవుతుంది.

కొన్ని ముఖ్యమైన పనులపై బయటకి వెళుతున్నప్పుడు ఎవరైనా తుమ్మగానే, ఇక వెళ్లే పని కాదనుకుని డీలాపడిపోవడం జరుగుతుంటుంది. ఒక తుమ్ము మాత్రమే వినిపిస్తే కొంతసేపు ఆగవచ్చు, కానీ రెండు తుమ్ములు కార్యానుకూలతను సూచిస్తాయి. కాబట్టి రెండు తుమ్ములు వినిపిస్తే నిస్సందేహంగా బయలదేరవచ్చు. ఇక చిన్న పిల్లల తుమ్ములను ... బాలింతల తుమ్ములను పెద్దగా పట్టించుకోనవసరం లేదని పెద్దలు చెబుతూ వుంటారు.

ఏ పనిమీదైనను ఎక్కడికైనా బయలు దేరునపుడు నల్లని కుక్క ఎదురుగా వస్తే చాలా మంచిది. ఇక ఏ ఇంటి ముందైతే కుక్క ఏడుస్తూ కూర్చుంటుందో, ఆ ఇంటి వారు అనారోగ్యానికి గురి కావడంగానీ, వారి ప్రాణాలకు హాని కలగడంగాని జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం అన్నివిధాలా మంచిది. పనిపై వెళుతున్నప్పుడు దారికి పిల్లి అడ్డుగా వస్తే వెంటనే ఆగిపోయి, కాసేపు ఆగాక బయలు దేరడం ఉత్తమం. అయితే ఎలుకను చంపి దానిని నోట కరుచుకుని వస్తూ పిల్లి ఎదురు పడితే ఆ శకునాన్ని మంచిదిగా భావించవచ్చు. అలాంటి శకునం వల్ల బయలుదేరిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

ప్రయాణానికి సిద్ధమైనప్పుడు వెనుక నుంచి ముందుకు 'కాకి' వెళితే, ఎలాంటి సందేహం లేకుండా బయలుదేరవచ్చు. ఒకవేళ ఆ సమయంలో తలపై కాకి తన్నితే, కార్య హానిగా భావించి వెంటనే ఆ ప్రయాణాన్ని మానుకోవలసి వుంటుంది. ప్రయాణ సమయంలో ఇంటి ఆవరణలో 'గుడ్లగూబ'ను చూసినా ... అది అరిచినా ఆ ప్రయాణమును వాయిదా వేసుకోవడం మంచిది.

'పాలపిట్ట' కనిపిస్తే సర్వ శుభాలకు గుర్తుగా భావించి వెంటనే ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. అయితే పాలపిట్టను ఎదురుగా చూడటం వలన ఎంత మంచి జరుగుతుందో ... వెనుదిరిగి చూడటం వలన అంత చెడు జరుగుతుంది. ప్రయాణ సమయంలో 'గరుడ పక్షి' కనిపిస్తే చాలా మంచిది. అది కనిపించిన దిశగానే ప్రయాణం వుంటే, బయలుదేరిన ఉద్దేశం తప్పక నెరవేరుతుంది. ప్రయాణం నిమిత్తం ఇంట్లో నుంచి బయలుదేరిన వెంటనే 'పడగ విప్పిన పాము' ఎదురుగా వస్తూనో ... చెట్టు పైకి పాకుతూనో కనిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ చచ్చిపోయిన పాము కనిపిస్తే ఏదో ఒక విచారకమైన సంఘటన జరిగి వెనుదిరిగి రావలసి వస్తుంది.

ప్రయాణ ప్రారంభంలో కుడికన్ను కొన భాగము గానీ, ఎడమచెంపగాని అదిరిన యెడల కార్య భంగముగా భావించి వాయిదా వేసుకోవలసి వుంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం వీలుపడక తప్పని సరిగా బయలుదేర వలసి వస్తుంది. అయితే అపశకునముల కారణంగా వెళుతున్న పని అవుతుందా? ... కాదా ? అనే సందేహం మనసును పట్టి పీడిస్తూనే వుంటుంది. అందువలన అపశకునం ఏదైనా ఎదురైతే ... తిరిగి వచ్చి స్నానం చేసి ఇష్టదేవతారాధన చేసుకుని మళ్లీ బయలుదేరి అనుకున్న పనులను చక్కబెట్ట వచ్చును.

ఇక అశ్విని .. రోహిణి .. మృగశిర .. పునర్వసు .. పుష్యమి .. ఉత్తర .. హస్త .. అనూరాధ .. ఉత్తరాషాఢ .. శ్రవణ .. ధనిష్ఠ .. శతభిషం .. ఉత్తరాభాద్ర .. రేవతి నక్షత్రాలు ప్రయాణానికి శుభప్రదమైనవిగా చెప్పవచ్చు. ఇక విదియ .. పంచమి .. సప్తమి .. దశమి .. ఏకాదశి .. త్రయోదశి .. తిధులు అనుకూలమైనవిగా భావించవచ్చు . ఇక తూర్పు దిశగా ప్రయాణం చేయడానికి మంగళ వారం ... పడమర దిశకు బుధ - గురువారాలు ... ఉత్తర దిశకు ఆది - శుక్ర వారాలు ... దక్షణ దిశకు సోమ - శని వారాలు శ్రేష్టమైనవని శాస్త్రం చెబుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy