ap7am logo

కష్ట సుఖాలను సూచించే కలలు

Fri, Jan 17, 2014, 04:12 PM
Related Image కలలు కనడం సహజం ... ఆ కలలో కనిపించే దృశ్యాలను బట్టి ఆనందించడం ... ఆందోళన చెందడం జరుగుతూ వుంటుంది. కలలు భవిష్యత్తులో జరగనున్న పరిణామాలను సూచిస్తుంటాయని అంటారు. పురాణాలలోని కొన్ని సంఘటనలు ... ఇతిహాసాలలోని కొన్ని సందర్భాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఈ కారణంగానే చెడు కలలు వచ్చినప్పుడు అవి ఎక్కడ నిజమవుతాయోనని కంగారుపడుతుండటం జరుగుతోంది.

అయితే కల ఏదైనా తెల్లవారు ఝామున వస్తే తప్ప, ఇక ఏ సమయంలో వచ్చినా నిజమయ్యే అవకాశం లేదని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా కలలో జంతువులు కనిపించడం కూడా, భవిష్యత్తులో రానున్న కష్టసుఖాలను ముందుగానే తెలియజేస్తాయని అంటారు. తన పట్ల విశ్వాసం చూపుతున్నట్టుగా కలలో కుక్క కనిపిస్తే స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. అలా కాకుండా ఆ కుక్క తనని చూసి అరుస్తూ కనిపిస్తే స్నేహితులు ... శతృవులుగా మారనున్నారనే విషయాన్ని గ్రహించాలి.

అదే విధంగా క్రూర మృగాలు అరుస్తూ కలలో కనిపించినా, శత్రువులు తమని దెబ్బతీయడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా గమనించాలి. కలలో పిల్లి కనిపించడం, త్వరలో జరగనున్న ధన నష్టాన్ని సూచిస్తుంది. మేకలు ... గొర్రెలు కలలో కనిపించడం సంతాన పరమైన ఆపదలను సూచిస్తాయి. ఇక కలలో గేదెలు ... దున్నపోతులు కనిపించడం జరగనున్న ప్రాణహానిని తెలియజేస్తుంది. కలలో ఆవు కనిపించడం మంచిదే ... అయితే అది తరిమినట్టుగా కనపడకూడదు.

ఇక కలలో ఎద్దు కనిపిస్తే అనుకోని సమస్యలు ఎదురై జీవితాన్ని కష్టాలలోకి నెడతాయి. తాను గాడిదను తరుముతున్నట్టుగా కలవస్తే కష్టాలు తీరిపోనున్నట్టుగా భావించాలి. తనని గాడిద తరుముతున్నట్టుగా కల వస్తే కష్టాలు చుట్టుముట్టబోతున్నట్టు గ్రహించాలి. ఇక గుర్రం కలలో కనిపించడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ గుర్రంపై నుంచి తాను కింద పడిపోయినట్టు వచ్చే కల మాత్రం మంచిది కాదు. కలలో ఏనుగు కనిపించడం వలన ... దానిని అధిరోహించడం వలన సమస్త శుభాలు చేకూరతాయి, సంపదలు ... విజయాలు ... కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy