ap7am logo

బల్లిపాటు (మెడ నుంచి పాదాలు)

Mon, Jun 10, 2013, 03:23 PM
'మెడ'పై బల్లి పడటం వలన సంపద నశిస్తుంది. 'మెడకు ఎడమ వైపున' పడితే వాహన యోగం పడుతుంది. ఇక 'కుడిభాగాన'పడితే ముందుచూపుతో ఆలోచించే శక్తి సామర్ధ్యాలను కోల్పోతారు. 'కంఠం'పై బల్లి పడటం వలన సంపద పెరగడం ... సంతోషకరమైన సమాచారం తెలియడం జరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మరింత బలం చేకూరుతుంది.

మగవారికి 'హృదయ స్థానం'లో బల్లిపడటం వలన ప్రతిదానికి వెనకడుగు వేయడం మొదలవుతుంది. స్త్రీలకు కుడి 'స్తనము'పై పడినా సకల సౌభాగ్యాలకు కొదవ వుండదు. కానీ 'ఎడమ స్తనం'పై పడితే ఇందుకు భిన్నంగా జరుగుతుంది.'కుడి భుజం' పై బల్లి పడటం వలన తాము అనుకున్న విషయంలో విజయాన్ని సాధిస్తారు. ఇక 'ఎడమ భుజము'పై పడటం వలన తమ చుట్టూ వున్నవారి ఆదరాభిమానాలు పొందుతారు. అయితే వీరికి మృత్యు భయం లేకపోలేదు.

'వీపుభాగం'లో కుడివైపున బల్లిపడితే ప్రాణభీతి కలుగుతుంది ... ఎడమభాగాన పడితే కార్యరంగాన విజయం చేకూరుతుంది. ఇక వీపు మధ్యలో 'వెన్నుపూస'పై పడితే ప్రాణభయం ఉంటుందనే ఆలోచనలతో ఆందోళన చెందుతూ వుంటారు. 'కుడి అరచేతి'లో గానీ ... అరచేతి చివరిలో గాని బల్లిపడితే సిరిసంపదలు వృద్ధి చెందడమే కాకుండా, పరువు ప్రతిష్ఠలు మరింత బలపడతాయి. ఇక 'ఎడమ అరచేతి' లో పడినట్లయితే, ఆ రోజు నుంచి కష్టనష్టాలు కలిసి పలకరిస్తుంటాయి.

'చేతి వ్రేళ్ల'పై బల్లి పడటం వలన అనుకోని ఆపదలు ఎదురవుతూ వుంటాయి.'మోచేతుల'పై పడటం కూడా అంత మంచిది కాదు. ఈ రకమైనటువంటి బల్లిపాటు ... ఆనందానికి ... ఐశ్వర్యానికి దూరం చేస్తుంది. 'పొట్ట'పై బల్లిపాటు సంపద పెరుగుదలను సూచిస్తుంది. ఇక 'నాభి'యందు బల్లిపాటు వైవాహిక జీవితంలోని సౌఖ్యాన్ని పెంచుతుంది.

'నడుము కుడిభాగం'లో గానీ ... 'ఎడమభాగం'లో గాని బల్లి పడితే తల్లిదండ్రులకు హాని జరిగే అవకాశం వుంది. 'నడుము మధ్య'లో పడితే, అనుకోకుండా సంపద కలిసి రావడం ... ఏ పని ప్రారంభించినా అది విజయవంతం కావడం జరుగుతుంది.

ఇక పక్కటెముకలపై పడటం తోడబుట్టినవారికి జరగనున్న హానిని తెలియజేస్తుంది. కుడి ... ఎడమ పిరుదుల పై బల్లిపాటు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ప్రదేశాల్లో బల్లిపాటు ధన ధాన్యాలను ... సుఖ సంతోషాలను ఇస్తుంది.

'కుడితొడ'పై బల్లిపాటు సంతానమునకు సంభవించనున్న కీడును తెలుపుతుంది. ఇక 'తొడముందు' భాగంలో బల్లిపాటు వైవాహిక జీవన సౌఖ్యాన్ని ఇవ్వగా,'తొడవెనుక'భాగంలో పడినట్లయితే ప్రాణహాని జరిగే అవకాశముంది. 'కుడి మోకాలు'పై బల్లిపాటు చెడు ఫలితాలను సూచిస్తుంది. భవిష్యత్తులో జరగనున్న చెడుకు సంకేతంగా దీనిని చెప్పుకోవచ్చు.

'కుడి పిక్క' పై పడితే మంచి ఫలితలను ... 'ఎడమ పిక్క'పై పడితే చెడు ఫలితాలను చవి చూడ వలసి వస్తుంది. 'ఆసనము'పై బల్లిపాటు శుభ శకునాలను సూచిస్తుంది.'లింగము'పై బల్లి పడినా సంపద వృద్ధి చెందడమే కాకుండా, మంచి సంతానం లభిస్తుంది. అయితే 'వృషణాల' పై పడితే మాత్రం దాంపత్య హానిని సూచిస్తుంది.

పాదములకు కుడివైపు కింది భాగంలో బల్లి పడితే అదృష్టం కలిసి వస్తుంది ... ఎడమ వైపున పడితే దురదృష్టం వెదుక్కుంటూ వస్తుంది. ఇక పాదం మధ్యన పడినా ... గోళ్లపై పడినా కీడు జరుగుతుంది. 'కుడి అరికాలు'పై బల్లి పడటం వల్ల ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక 'ఎడమ అరికాలు' పై పడటం వల్ల ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది.

ఇక ఈ బల్లిపాటు అనేది ... అది పడిన రోజు ... సమయం ... ప్రదేశమును బట్టి దాని ఫలితం వుంటుంది. అయితే బల్లి పడింది కాబట్టి ఈ ఫలితాల నుంచి తప్పించుకోలేమని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దైవానుగ్రహం ఎటువంటి కష్టాలనైనా ... ఎలాంటి దోషాలనైనా తొలగించగలదు. బల్లి ఏ స్థానంలో పడినా వెంటనే తల స్నానం చేసి, ఇష్ట దైవం సన్నిధిలో దీపారాధన చేసి ఆ దైవాన్ని స్మరించుకుంటే దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy