ap7am logo

పుట్టుమచ్చలు (తొడలు - పాదాలు)

Mon, Jun 10, 2013, 11:57 AM
'కుడి తొడపై' వుండే పుట్టుమచ్చ ... విశేషమైనటువంటి పేరు ప్రతిష్ఠలను ... సిరి సంపదలను తెచ్చి పెడుతుంది. వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ... ఉత్సాహంగా ఉంటూ వుంటారు. పుట్టుమచ్చ స్పష్టతను బట్టి వీరు 'కుస్తీలు' పట్టడంలోను ప్రావీణ్యం సంపాదించే అవకాశం లేకపోలేదు. ఇక వీరికి అనుకోకుండా సంపద కలిసిరావడం ... విదేశీ విహారాలు చేయడం జరుగుతుంది. ఇక స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చ చక్కని సంసారాన్ని ... సంతానాన్ని సూచిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలు వీరి వైపు చూడనే చూడవు. ఇక చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి వెంటనే పరిష్కారమైపోతాయి. ఆనందంగా ... హాయిగా వీరి జీవితం కొనసాగుతుంది.


'ఎడమ తొడపై' పుట్టుమచ్చ వుంటే ... ఏదో ఒక విద్యలో నైపుణ్యాన్ని సంపాదిస్తారు. అయితే ఆ విద్యలో వారు పైకి రాకుండా వ్యసనాలు అడ్డుకుంటాయి. వీటి కారణంగా వీరు బంధు మిత్రుల్లో అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలలో ఈ పుట్టుమచ్చ అత్యాశకు ... అసంతృప్తికి కొలమానంగా కనిపిస్తుంది. జీవితంలో ఏ లోటూ లేకపోయినా దురాశకుపోయి ఇబ్బందుల్లో పడుతుంటారు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే క్రమంలో వీరు విచారాన్ని పొందుతూనే వుంటారు.


'కుడి మోకాలుపై' పుట్టుమచ్చ ఐశ్వర్యాన్ని ... అన్యోన్య దాంపత్యాన్ని సూచిస్తుంది. కొన్ని రకాల వ్యామోహాలు ఉన్నప్పటికీ అవి వారి ఎదుగుదలకు పెద్దగా సమస్య కావు. వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా వుండటం వలన, పదవీ వ్యామోహం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగానే వుంటాయి. స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చ ఉన్నతమైన వ్యవహార శైలికి ఉదాహరణగా కనిపిస్తుంది. వీరు అన్ని విషయాల్లో భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ, కుటుంబంలో ప్రధానమైన పాత్రను పోషిస్తారు. ఇతరులకు ఆదర్శప్రాయంగా వీరు నడచుకుంటారు.


'ఎడమ మోకాలు పై' పుట్టుమచ్చ గలవారు అల్ప సంతోషులనే చెప్పాలి. తాము మంచి మాటకారులమనే ఉద్దేశంతో ఇష్టానుసారం మాట్లాడుతూ, ఎదుటి వారిని కించపరుస్తూ వుంటారు. ఈ కారణంగా వీరికి శత్రువులు కూడా పెరిగిపోతుంటారు. ఈ పుట్టుమచ్చ స్త్రీల నిస్వార్ధ గుణానికి నిదర్శనంగా కనిపిస్తుంది. వీరికి సామాజిక సేవపట్ల ఆసక్తి ... దైవభక్తి ఎక్కువగా వుంటాయి. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో వీరిదే పైచేయిగా వుంటుంది.

ఇక 'కుడికాలు పిక్కపై' పుట్టుమచ్చ గలవారు ఏ పనిచేసినా అంకిత భావంతో చేస్తారు. ప్రతి విషయంలోనూ చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ, తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తారు. సాధారణంగా 'ఎడమకాలు పిక్కపై' పుట్టుమచ్చ గలవారు వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతుంటారు. అయితే చేస్తున్న వృత్తి పట్ల పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వలన ... అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల కారణంగా నష్టాలపాలవుతుంటారు.


'కుడిపాదం కుడి భాగంలో' పుట్టుమచ్చ మంచి మనస్తత్వమనే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. వీరు ప్రతి విషయాన్ని చురుకుగా ఆలోచించగలుగుతారు ... తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందరి పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటూ ... దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. స్త్రీలలో ... ఉదార స్వభావానికి ఉదాహరణగా ఈ పుట్టుమచ్చ కనిపిస్తుంది. ఇతరులకి సాయపడటంలోను ... మంచి పనులు చేయడంలోను వీరు ఎప్పుడూ ముందే వుంటారు. దైవంపట్ల వీరు చూపించే ప్రేమానురాగాలే వారికి ఎలాంటి లోటూ రాకుండా చూస్తుంటాయి.


ఇక 'కుడిపాదం ఎడమ వైపున' పుట్టుమచ్చ వుంటే ... పైన చెప్పిన లక్షణాలు నామమాత్రంగా కనిపిస్తాయి. సంపాదన తక్కువే అయినా జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. స్త్రీలలో ఈ పుట్టుమచ్చ వారి సాధారణమైన జీవితాన్ని సూచిస్తుంది. సున్నితమైన విషయాల పట్ల వీరు దురుసుగా ... దూకుడుగా వ్యవహరిస్తూ వుంటారు. ఏ విషయంపైనా సరైన శ్రద్ధాసక్తులు చూపలేక, మనఃశాంతికి దూరమవుతుంటారు.
'ఎడమకాలు పాదంపై' పుట్టు మచ్చ ... పద్ధతి లేని జీవితానికి అద్దం పడుతుంది. కారణమేదైనా వీరు ప్రతివారితోను గొడవకి దిగుతుంటారు. ఫలితంగా బంధువులకు ... భార్యకు కూడా దూరమైపోతారు. వ్యసనాల కారణంగా ఆర్ధిక పరమైన ఇబ్బందులను అనుభవిస్తూ, నిరాశా నిస్పృహలతో కాలం గడుపుతుంటారు.'అరికాలు'లో పుట్టుమచ్చ ... అందాన్ని ... అదృష్టాన్ని ... తెలివి తేటలను సూచిస్తుంది. అందరితో వీరు కలుపుగోలుగా మాట్లాడుతూనే, తమకి కావలసిన లబ్దిని పొందుతూ వుంటారు. ఇక వీరు ఒకచోట ఉండకుండా ఎప్పుడూ ఎక్కడికో ఒక చోటుకి ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కేవలం దురాశ కారణంగా ... వ్యామోహాల కారణంగా వీరు నలుగురిలో పలచనై పోతుంటారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy