ap7am logo

పుట్టుమచ్చలు (కుడి అరచేయి - వ్రేళ్లు)

Mon, Jun 10, 2013, 11:11 AM
'కుడిఅరచేతి'యందు 'తేనెరంగు'పుట్టుమచ్చ వుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ పుట్టుమచ్చ కారణంగా సిరిసంపదలు ... కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అరచేతిలో పుట్టుమచ్చ గలవారు విద్య పట్ల ఆసక్తిని ... కళలపట్ల మక్కువను కనబరుస్తారు. ఆయా రంగాలలో చెప్పుకోదగిన స్థాయికి వీరు చేరుకుంటారు. ఇక పుట్టుమచ్చ 'నలుపు రంగులో' వుంటే దాని వల్ల మంచి కన్నా చెడు ఫలితమే ఎక్కువగా కన్పిస్తుంది.
ఇక స్త్రీలకు 'కుడి అరచేతి'లో పుట్టుమచ్చ ... వారి శాంతియుతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. నిదానంగా ... నేర్పుగా వీరు తమ పనులను చక్కబెడతారు. వీరి ముందు చూపు కారణంగా జీవితం ఏ లోటూ లేకుండా హాయిగా గడిచిపోతుంది.

ఇక 'కుడి అరచేతి వ్రేళ్ల' విషయానికే వస్తే ... పుట్టు మచ్చ 'కుడిచేయి బొటన వ్రేలు క్రింద' వుంటే, తమ యజమానిపై పూర్తి విశ్వాసం కలిగి పని చేస్తారు. నిర్మలమైన మనసుతో ఇరుగు పొరుగు వారికి సాయపడుతూ వుంటారు. డబ్బుకు లోటు లేకుండా వీరి జీవితం కొనసాగుతూ వుంటుంది. ఈ పుట్టుమచ్చ 'బొటన వ్రేలు మీద' ఉన్నట్టయితే సంఘంలో మంచి స్థానం లభిస్తుంది. వీళ్లు ఎలాంటివారినైనా తమ వాదనతో మెప్పించగలుగుతారు ... ఒప్పించ గలుగుతారు.

పుట్టుమచ్చ 'చూపుడు వ్రేలు కింద'వుంటే ... ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి వుంటారు. ప్రభుత్వరంగానికి సంబంధించిన ఉద్యోగం చేస్తూ, ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరిలో కలుపుగోలుతనం ఎక్కువగా కనిపించదు. సాధ్యమైనంత వరకూ ఏకాంతంగా కాలం గడపడానికే ఇష్టపడుతుంటారు. ఇక ఈ పుట్టుమచ్చ 'చూపుడు వ్రేలు మీద' వుంటే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. నిలకడలేని నిర్ణయాల వలన జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

'మధ్య వ్రేలు కింద'వుండే పుట్టుమచ్చ ... నైతిక విలువలు లేని తనాన్ని సూచిస్తుంది. ఎవరెటు పోయినా తాము మాత్రం సుఖంగా వుంటే చాలు అనే విధంగా వీరు ఆలోచిస్తూ, అలాంటి పనులే చేస్తుంటారు. సత్య ధర్మాలకు దూరంగా ... వ్యసనాలకు దగ్గరగా వీరు సంచరిస్తుంటారు. కుటుంబ జీవితాన్ని సమస్యలమయం చేసుకుని సంతృప్తి లేకుండా జీవిస్తుంటారు. ఇక 'మధ్య వ్రేలు పైన' పుట్టుమచ్చ వుంటే, స్థాయికి తగనివారితో స్నేహాలు చేస్తారు. నలుగురి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తూ విమర్శలు ఎదుర్కుంటూ వుంటారు.

'ఉంగరం వ్రేలు కింద' పుట్టుమచ్చ గల వారికి మనసు నిలకడగా వుండదు. ఎన్నో పనులు చేయాలని వుంటుంది కానీ ... అడుగు ముందుకు వేసే ధైర్యం తక్కువగా వుంటుంది. అన్నవస్త్రాలకు లోటు వుండదు కానీ .... తరచూ సమస్యలు ఎదురు కావడం ... వాటితో పోరాడుతుండటంతో సరిపోతుంది. 'ఉంగరపు వ్రేలు మీద' పుట్టుమచ్చ ... మంచితనానికి మానవత్వానికి అద్దం పడుతుంది. శాంత స్వభావులైన వీరిలో దైవభక్తి ఎక్కువగా వుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలకు విలువను ఇస్తూ పద్దతిగా నడచుకుంటూ వుంటారు. నిదానమే ప్రధానమనే నానుడిని ఎల్లప్పుడూ నమ్ముతూ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు.

ఇక 'చిటికెన వ్రేలు క్రింద' పుట్టుమచ్చ గలవారిలో ఆత్మ విశ్వాసం ... సమయస్ఫూర్తి ఎక్కువగా వుంటాయి. లౌకిక వ్యవహారాలు చక్కబెడుతూనే, దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటూ వుంటారు. అన్యోన్య దాంపత్యంతో వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. 'చిటికెన వ్రేలు మీద' ఉన్నట్టయితే సకల సంపదలు సొంతమవుతాయి. అందం ... అలంకరణ విషయాలకు ప్రాధాన్యతనిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇక 'ఎడమ అరచేయి ... వ్రేళ్ల' పై గల పుట్టుమచ్చలకు సాధారణమైన ఫలితాలు మాత్రమే ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy