ap7am logo

రక్షాబంధన్

Sat, Jun 08, 2013, 03:36 PM
Related Image తమ సోదరుల క్షేమం కోరుతూ అక్కా చెల్లెళ్లు ... భర్త క్షేమాన్ని- విజయాన్ని కోరుతూ భార్య కట్టే రక్షా కంకణమే 'రక్షాబంధన్'. అయితే కాలక్రమంలో ఇది కేవలం అక్కా చెల్లెళ్లు ... అన్నదమ్ముల అనుబంధానికి మాత్రమే పరిమితమైపోయింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. శ్రావణ మాసపు పౌర్ణమి రోజున జరుపుకుంటాం గనుక దీనిని 'శ్రావణ పౌర్ణమి'అనీ,ఈ రోజున బ్రాహ్మణులు కొత్త యజ్ఞోపవీతాలు ధరిస్తారు కాబట్టి దీనిని 'జంధ్యాల పౌర్ణమి'అని అంటారు.

ఇక ఈ రోజున ఉదయాన్నే ఇంటిల్లిపాది తలస్నానం చేసి కొత్తవస్త్రాలు ధరిస్తారు. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు నుదుటున తిలకందిద్ది హారతి పడతారు. వారు తలపెట్టిన కార్యాలు నెరవేరాలనీ, అందుకు అవసరమైన శక్తి సామర్ధ్యాలను ... ఆయురారోగ్యాలను ప్రసాదించమని దైవాన్ని కోరుతూ రక్షాబంధన్ కడతారు. తమ క్షేమాన్ని కోరుతూ అక్కాచెల్లెళ్లు 'రక్ష' కట్టిన సందర్భంగా సోదరులు వారికి ధన .. కనక .. వస్తు .. వాహనాలను కానుకలుగా ఇవ్వడం జరుగుతుంటుంది.

ఇక ఆడపిల్లలకు వివాహమై ఎంత దూరంలో ఉన్నప్పటికీ, ఈ పండుగ రోజుకి వాళ్లు సోదరుల ఇంటికి చేరుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తాము వెళ్ళకపోతే తమ సోదరులు చిన్నబుచ్చు కుంటారని భావించి బయలుదేరుతూనే ఉంటారు. కారణాలేవైనా అక్కచెల్లెళ్లని చూడక చాలా రోజులైనప్పుడు అన్నదమ్ములు ఈ పండుగ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

సాధారణంగా వివాహం జరిగిన తరువాత మగపిల్లలు తమ తోడబుట్టిన అక్కచెల్లెళ్లకు దూరమవుతుంటారు. కానీ తల్లిదండ్రుల తరువాత ఆడపిల్లల బాగోగులను చూసుకోవలసిన బాధ్యత అన్నదమ్ములకు ఉంటుంది. ఆడపిల్లలను అన్నదమ్ములు మరిచిపోకూడదనే మన సంప్రదాయంలో, ఆడపిల్లల కుటుంబాలకు సంబంధించిన ప్రతి శుభకార్యంలోను అన్నదమ్ముల పాత్ర ప్రముఖంగా ఉండేలా చేశారు.

అలా అక్కాచెల్లెళ్ల సంతానానికి మేనమామలుగా ... చెవులు కుట్టించడం దగ్గర నుంచి పెళ్లి మంటపానికి బుట్టలో పెళ్లికూతురు (మేనకోడలు )ను తీసుకు రావడం వరకూ వీరి ప్రమేయం వుంటూనే ఉంటుంది. మరి ఇంతటి బాధ్యతను భుజాన వేసుకునే సోదరుల క్షేమాన్ని కోరుకునే ఆడపిల్లలు అంతటి ప్రేమానురాగాలను చూపిస్తూ ఉంటారు. ఇక తోడబుట్టిన అన్నదమ్ములు లేని వారు, వరుసకు అన్నదమ్ములైన వారికి రక్షాబంధన్ కట్టి తమకి అండదండగా ఉండమనే ఆకాంక్షను తెలియజేస్తారు.

అనురాగాలకి అద్దంపట్టే ఈ పండుగ వెనుక పురాణ సంబంధమైన కథ ఒకటి లేకపోలేదు. పూర్వం దేవతలకు ... దానవులకు మధ్య యుద్ధం జరుగుతూ వుండగా అపజయం తప్పదని భావించిన దేవేంద్రుడు దిగాలు పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవేంద్రుడిలో సమరోత్సాహాన్ని పెంపొందించాలని ఆయన భార్య 'శచీదేవి' నిర్ణయించుకుంది. ఆ రోజున 'శ్రావణ పౌర్ణమి' కావడంతో పార్వతీ పరమేశ్వరులను ... లక్ష్మీ నారాయణులను పూజించి, ఆ పూజలో ఉంచిన 'రక్షా కంకణం' దేవేంద్రుడి చేతికి కట్టింది. దాంతో ఆయన రాక్షసులను ధైర్యంగా ఎదిరించి త్రిలోకాధిపత్యాన్ని పొందాడు. అలా పురాణకాలంలో శచీదేవి ప్రారంభించిన రక్షాబంధనం, ఆ తరువాత 'రాఖీ పండుగ'గా ప్రచారంలోకి వచ్చింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy