ap7am logo

హనుమజ్జయంతి

Sat, Jun 08, 2013, 03:07 PM
Related Image ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ... ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో ... అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి జన్మ వృత్తాంతంలోకి వెళితే ... ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా, 'పుంజికస్థల'అనే అప్సరస ... బృహస్పతితో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, భూలోకాన 'వానర స్త్రీ'గా జన్మించమని శపించాడు.

తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాపవిమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణ జన్ముడైన వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు. దాంతో 'పుంజికస్థల'భూలోకాన 'అంజనాదేవి'గా జన్మించి, కాలక్రమంలో 'కేసరి'అనే వానరుడిని వివాహమాడింది. శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్ధించింది.

ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ - విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో , వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు 'వైశాఖ బహుళ దశమి' రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు.

తల్లి ఆలనాపాలనలో పెరుగుతోన్న హనుమంతుడు, ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగా భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి 'ఎడమ దవడ'కి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు.

అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా రుషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు, రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకు వచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ ... లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను ... వారధి నిర్మించడంలోను ... యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు 'సంజీవిని' పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం.

'త్రిపురాసుర సంహారం' సమయంలో పరమ శివుడికి శ్రీ మహా విష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువల్లనే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు రామావతారం దాల్చినప్పుడు, శివుడు ... ఆంజనేయస్వామిగా అవతరించి, రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఎంతో ఇష్టపడతారు.

ఇక ప్రతి ఊరిలో రామాలయం వుంటుంది ... ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందువలన ఈ హనుమజ్జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం ... ఆకు పూజలు చేయించడం ... ఆయనకి ఇష్టమైన 'వడ' మాలలు వేయించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం ... హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy