అయ్యప్పస్వామి దివ్య క్షేత్రం

అయ్యప్పస్వామి జన్మ రహస్యం ... ఆయన ఆవిర్భవించడానికి గల కారణాలు ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటాయి. శబరిమలలో కొలువైన తరువాత ఆయన చూపిన మహిమలను నేటికీ భక్తులు పదే పదే తలచుకుని పరవశించిపోతుంటారు. కులమత బేధాలు ... పేద - ధనిక తారతమ్యాలు లేకుండా దేశ విదేశాల్లో ఆయన భక్తులు కనిపిస్తుంటారు. వీరంతా కూడా స్వామివారి దీక్ష తీసుకుని, కఠినతరమైన నియమాలను పాటిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.

శబరిమల వరకూ వెళ్లలేని భక్తుల కోసం ఆయన కొన్ని పవిత్రమైన ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఈ నేపథ్యంలో నిర్మించబడిన అయ్యప్ప స్వామి ఆలయం మనకి ఖమ్మం జిల్లా 'వైరా' లో దర్శనమిస్తుంది. స్వామివారు కలలో కనిపించి ఆదేశించిన మేరకు ఒక భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. నాటి నుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. కార్తీకమాసం ఆరంభమైన దగ్గర నుంచి సంక్రాంతి పండుగ పూర్తయ్యేంత వరకూ ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

ఇరుముళ్ళు కట్టడాలు ... విప్పడాలు ... పడిపూజలు ... శరణు ఘోషలతో ఆలయం సందడిగా కనిపిస్తూ వుంటుంది. 18 మెట్ల తరువాత వేదికపై కొలువైన అయ్యప్పస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తీరవలసిందే. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వరస్వామి ... శ్రీ శిరిడీ సాయిబాబా ... జ్ఞానసరస్వతి ... హనుమంతుడు కొలువై పూజలందుకుంటూ వుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు అయ్యప్పస్వామితో పాటుగా, హరిహరుల అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు.


More Bhakti News