శివ నివాసమైన కైలాసకోన

05-06-2013 Wed 11:48

ఇటు వైకుంఠనాథుడు ... అటు కైలాసవాసుడు ఇద్దరూ కూడా ప్రకృతి ప్రియులేనని చెప్పాలి. అందుకే దాదాపుగా ఇద్దరి క్షేత్రాలు పచ్చని ప్రకృతి మధ్య కొండలపై కొలువుదీరి కనిపిస్తుంటాయి. అలా పరమశివుడు మనసుదోచుకుని పార్వతీ సమేతుడై ఆయన వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రమే 'కైలాస కోన'. ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నారాయణపురం సమీపంలో దర్శనమిస్తుంది.

కైలాసకోన పైనుంచి కనిపించే రమణీయ ప్రకృతి సౌందర్యం చూస్తే భగవంతుడి సృష్టి ఎంత గొప్పదనే విషయం అర్థమవుతుంది. సాక్షాత్తు ఇక్కడి వాతావరణం సదాశివుడికి కూడా బాగా నచ్చేసిందట. నారాయణపురంలో పద్మావతి - వేంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం తిలకించడానికి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం వారికి నచ్చడంతో కొంత కాలంపాటు ఈ కొండపై సేదదీరినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ కొండకు 'కైలాస కోన' అనే పేరు వచ్చింది.

ఇక్కడి కైలాస గుహలో భక్తవ శంకరుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ... ఆ పక్కనే వీరభద్రుడు కనిపిస్తుంటారు. కైలాసకోన అనే పేరు వినడానికి బాగుందనిపించడమే కాకుండా, ఈ క్షేత్రాన్ని చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ఇక ఇక్కడి గుహలో కొలువుదీరిన శివయ్య ... ఆ పై నుంచి దూకే జలపాతం ... మనోహర దృశ్యాలై హృదయ ఫలకంపై చెరగని ముద్ర వేస్తాయి. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ఇక్కడి జలపాతంలో స్నానమాచరిస్తూ శివానందాన్ని పొందుతుంటారు.


More Bhakti Articles