విదేశాల్లో వినాయకుడు

వినాయకుడి పటంలేని ఇల్లుగానీ ... ఆయన ఆలయంలేని ఊరుగానీ ... ఆయన అనుగ్రహంలేని విజయంగాని కనిపించవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎవరు ఎలాంటి కార్యాన్ని తలపెడుతున్నా ముందుగా చెప్పుకునేది ఆయనకే. తొలి ఆశీస్సులను ఆయన దగ్గరే పొందుతారు ... తొలి ఆహ్వానాన్ని ఆయనకే అందజేస్తారు ... తొలి ఆతిథ్యం ఆయనకే ఇస్తారు. అలా వినాయకుడు ఇలవేల్పుగా ... ఇష్ట దైవంగా తొలి పూజలను అందుకుంటున్నాడు.

తాను స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రల్లోనే కాదు, ఇతర దైవ క్షేత్రాల్లో కూడా ఆయన తనదైన ప్రత్యేక స్థానంలో కొలువై కనిపిస్తుంటాడు. ఇక వివిధ రూపాల్లో దర్శనమిచ్చే దైవాల్లో వినాయకుడే ముందువరుసలో కనిపిస్తుంటాడు. అలాంటి వినాయకుడు భారతదేశంలోనే కాకుండా, వివిధ దేశాల్లో సైతం పూజలు అందుకుంటూ వుండటం విశేషం. ఆయా దేశాలలో అనేక రూపాలతో ... వివిధ పేర్లతో పిలవబడే వినాయకుడు ఇన్ని దేశాలను ఇంతగా ప్రభావితం చేశాడా అని అనిపిస్తుంది. జగన్మాత కుమారుడు కాబట్టి ఆయనది కాని ప్రదేశం ... ప్రాంతం ఏముంటాయనిపిస్తుంది.

అమెరికాలో వేల సంవత్సరాల క్రితమే వినాయకుడిని ఆరాధించిన ఆధారాలు వున్నాయి. ఇక్కడి వారు వినాయకుడిని 'లంబోదరుడు' గా కొలుస్తూ వుంటారు. జపాన్ లో సుఖ సంతోషాలను ప్రసాదించే 'సువర్ణ గణపతి' గా పూజలు అందుకుంటూ ఉంటాడు. చైనాలో 'కాంగితేన్' పేరుతో పురాతన కాలం నుంచే వినాయకుడిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఇండోనేషియా ప్రజలు 'అయూథియాన్' పేరుతో గణపతిని ప్రార్ధిస్తుంటారు.

కం బోడియా వాసులు కంచుతో వినాయక విగ్రహాలను రూపొందించుకుని 'ప్రాకెనిస్' అనే పేరుతో పూజిస్తుంటారు. ఇక ఇరాన్ లో 'ఆహురంస్థా' అనే పేరుతో వినాయకుడిని అర్చిస్తుంటారు. ఆఫ్గనిస్తాన్ లో వినాయకుడు నుంచుని దర్శనమిస్తే ... భూటాన్ లో పద్మాసనంలో కనిపిస్తాడు. నేపాల్ లో సింహవాహన ధారిగా ... మంగోలియాలో త్రిశూల ధారిగా కొలువై ఉంటాడు.

ఇక సిలోన్ ... బర్మా దేశస్తులు కూడా వినాయకుడిని విఘ్నాలను తొలగించే దేవుడిగానే పూజిస్తూ వుంటారు. అలాగే మెక్సికోలో వినాయకుడిని సంపదలను ఇచ్చే దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. ఇలా అనేక దేశాలలో పలునామాలతో పలు విధాలుగా వినాయకుడు పూజించబడుతున్నాడు ... సమస్త జనులకు శుభాలను ప్రసాదించే దేవుడిగా ఆరాధించబడుతున్నాడు.


More Bhakti News