నిప్పు తెచ్చిన పోలేరమ్మ

వీరబ్రహ్మేంద్రస్వామి వారు తాను దైవాంశ సంభూతుడినని ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. మౌనంగా ఆయన తనపని తాను చూసుకుపోయేవాడు. అందువలన 'కందిమల్లయ్య పల్లె' లోని వారంతా ఆయనని వీరయ్య అని పిలుస్తూ ఓ సాధారణ వ్యక్తిగానే చూసేవారు. ఈ కారణంగానే ఆ గ్రామ పెద్దలు ఆయన పట్ల అహంభావాన్ని ప్రదర్శించారు. ఫలితంగా బ్రహ్మం గారి మహిమను సామాన్య ప్రజానీకం సైతం తెలుసుకునేందుకు కారకులయ్యారు.
కందిమల్లయ్య పల్లె వాసులు 'పోలేరమ్మ'ను గ్రామదేవతగా ఆరాధించేవారు. ఆ ఏడాది అమ్మవారి జాతర ఘనంగా జరిపించడం కోసం గ్రామ పెద్దలు చందా వసూలు చేయడం మొదలు పెట్టారు. చందా ఇవ్వమంటూ వీరయ్యను కూడా అడిగారు. వాళ్లు అడిగిన తీరు నచ్చకపోవడంతో ఆయన మౌనం వహించాడు. గ్రామంలో నివసిస్తోన్న ప్రతి ఒక్కరూ చందా ఇవ్వవలసిందేననీ, లేదంటే పోలేరమ్మకి కోపం వస్తుందంటూ భయపెట్టడానికి ప్రయత్నించారు.
దాంతో అమ్మవారి సమక్షంలోనే చందా ఇస్తాను రమ్మంటూ వాళ్లని పోలేరమ్మ గుడి దగ్గరికి తీసుకువెళ్లాడు వీరయ్య. గ్రామస్తులు కూడా వారిని అనుసరించారు. అక్కడికి వెళ్లిన ఆయన చందా ఇవ్వకుండా నోట్లో చుట్ట పెట్టుకుంటూ గ్రామపెద్దలను నిప్పు అడిగాడు. ఆయన నిర్లక్ష్య వైఖరిని కోపంతో చూస్తూ వాళ్లు అలాగే నుంచున్నారు. అయితే పోలేరమ్మనే నిప్పు అడుగుతానంటూ ఆమెని పిలిచాడు వీరయ్య. అంతే గుడిలో గంటల శబ్దం ... లోపలి నుంచి గజ్జెల శబ్దం వినిపిస్తుండగా పోలేరమ్మ నిప్పుతీసుకుని వచ్చి వీరయ్య చేతికి అందించింది. ఆయన చుట్ట వెలిగించుకోగానే తిరిగి వెళ్లిపోయింది.
ఈ దృశ్యం చూసిన వారికి నోటమాట రాలేదు. గ్రామ పెద్దలు మాత్రం తమని మన్నిచమంటూ ఆయన కాళ్లపైపడ్డారు. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఆ గ్రామస్తులు వీరయ్యను ... వీరబ్రహ్మేంద్ర స్వామిగా భావించారు ... అనుదినం ఆయనను పూజించారు ... ఆయన సేవలోనే తరించారు.








