గోకర్ణ క్షేత్రం

కర్ణాటక - హుబ్లీ సమీపంలో వెలసిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రం ... 'గోకర్ణం'. భూకైలాసంగా ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికిగల కారణం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. పూర్వం రావణాసురుడు తన తల్లి 'కైకసి' పూజించుకోవడం కోసం 'కైలాసగిరి'ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అహంకారంతో ప్రయత్నించి భంగపడ్డాడు. అయితే శివుడు అతని భక్తికి మెచ్చి తన ఆత్మ లింగాన్ని ప్రసాదించాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టరాదనీ ... అదే జరిగితే దానిని లేవనెత్తడం అసంభవమని చెప్పాడు.

ఆత్మ లింగాన్ని తీసుకుని రావణుడు ఆనందంతో లంకా నగరానికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ - విష్ణువు ఇద్దరూ కూడా రావణుడు ఆత్మలింగంతో తన నగరానికి చేరుకునేలోగా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ బాధ్యతను నారదుడు భుజాన వేసుకుని రావణాసురుడికి దగ్గరికి చేరుకున్నాడు. అతని చేతిలో వున్నది ఆత్మ లింగం కాదని నమ్మించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తప్పని సరి పరిస్థితిల్లో గోపాలకుడి వేషంలో వినాయకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

సంధ్యా సమయమైందనే విషయాన్ని రావణుడికి గుర్తుచేశాడు నారదుడు. తాను సంధ్య వార్చుకుని వచ్చేంత వరకూ శివలింగాన్ని పట్టుకోమని గోపాలకుడి వేషంలో వున్న వినాయకుడికి రావణుడు అప్పగించాడు. తాను మూడుసార్లు పిలుస్తానని ... ఈ లోగా రాకపోతే ఆ శివలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్పాడు మారువేషంలో వున్న వినాయకుడు. రావణుడు అలా వెళ్లగానే వెంటవెంటనే మూడుసార్లు పిలిచి ఆ శివలింగాన్ని కింద పెట్టేశాడు.

పరిగెత్తుకు వచ్చిన రావణుడు ఆ శివ లింగాన్ని లేవనెత్తడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయితే అంతకంతకు అది పెరిగిపోవడంతో రావణుడుకి అది అసాధ్యమై పోయింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని 'మహాబలేశ్వరుడు'అని పిలుస్తుంటారు. ఇక రావణుడు ఆత్మలింగాన్ని లేవనెత్తేందుకు చేసిన ప్రయత్నంలో దాని 'పానవట్టం'సాగిపోయి 'గోవుచెవి' ఆకారాన్ని సంతరించుకుంది. ఈ కారణంగా ఇది 'గోకర్ణ క్షేత్రం'గా ప్రసిద్ధి చెందింది. సదాశివుడితో పాటు అమ్మవారు 'తామ్రగౌరి' పేరుతో పూజలు అందుకుంటూ ... అనుగ్రహిస్తూ వుంటుంది.


More Bhakti News