కార్తికేయస్వామి క్షేత్రం

నిరంతరం భక్తులను కనిపెట్టుకుని వుండటం...ఆపదల్లో వారిని ఆదుకుంటూ వుండటం కుమారస్వామికి తండ్రి నుంచి అబ్బిన అలవాటుగా చెప్పుకోవచ్చు. తండ్రి మాదిరిగానే ఆయన కొండలపై కొలువుదీరిన క్షేత్రాలే ఎక్కువ. తమిళులు 'మురుగన్' అని ముద్దుగా పిలుచుకునే ఈ స్వామి క్షేత్రాలు, అక్కడే పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా ... విశిష్టమైనదిగా...'విరాలిమలై' వెలుగొందుతోంది.

తమిళనాడులోని ఈ ప్రాంతంలో, ప్రాచీనకాలం నుంచి స్వామి పూజలు అందుకుంటున్నాడని చెబుతుంటారు. కోరిన వరాలను ప్రసాదించే ఈ స్వామి కొండపై కొలువుదీరి, శ్రీ వల్లీ దేవసేన సమేతంగా దర్శనమిస్తుంటాడు. 'షణ్ముఖుడు' అనే పేరుకు తగినట్టుగా ఇక్కడ స్వామి ఆరు ముఖాలతో ఆవిర్భవించడం విశేషం. ఇక ఈ క్షేత్రాన్ని దర్శించాలనే ఆలోచన రావడానికి కూడా స్వామి అనుగ్రహం వుండాలని చెబుతుంటారు. అలా ఈ స్వామివారి చెంతకు బయలుదేరిన వారికి ఎలాంటి ఆటంకాలు కలగవని అంటారు.

దైవం తన భక్తులకు ఎదురై ... తన ఆలయాన్ని దర్శించి వెళ్లమన్న అద్భుతమైన సంఘటన ఈ క్షేత్రం విషయంలో జరిగిందని అంటారు. పూర్వం 'అరుణగిరినాథర్' అనే కుమార స్వామి భక్తుడు ఉండేవాడట. అనునిత్యం ఆయన కుమారస్వామిని ధ్యానిస్తూ ఆ స్వామిపై అనేక పాటలను రాసి ... వాటిని పాడుతూ పరవశిస్తూ ఉండేవాడు. ఒకసారి స్వామికి ఆయన స్వప్నంలో కనిపించి, ఈ క్షేత్రాన్ని దర్శించి వెళ్ల వలసిందిగా కోరాడట.

మరునాడు ఉదయాన్నే ఈ క్షేత్రానికి బయలుదేరిన అరుణగిరినాథర్, అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ వుండగా క్రూరమృగాలు చుట్టుముట్టాయి. తన ప్రాణాలు పోవడం ఖాయమని ఆయన అనుకుంటూ వుండగా సాక్షాత్తు కుమారస్వామి వచ్చి ఆ మృగాలను తరిమేసి ఆయనను దగ్గరుండి తీసుకువెళ్లాడని స్థల పురాణం చెబుతోంది. కుమార స్వామి తన భక్తుల వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడతాడనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కారణంగానే భక్తులు ఆయనను అనేక విధాలుగా సేవిస్తుంటారు. విశేషమైనటువంటి పుణ్య దినాల్లో స్వామివారికి జరిగే ఉత్సవాలలో పెద్దసంఖ్యలో పాల్గొంటూ పరవశిస్తుంటారు.


More Bhakti News