పశుపతినాథ్ ఆలయం

సమస్త జీవులకు నాథుడు శివుడే ... దేహాన్ని వదలిన అనంతరం అన్ని జీవులు కలిసిపోయేది ఆయనలోనే. అందుకే పశుపతి నాథుడిగా ఆయన పిలవబడుతున్నాడు. తరతరాలుగా తరగని భక్తి శ్రద్ధలతో కొలవబడుతున్నాడు. భగవంతుడి యొక్క తత్త్వం తెలిసినవారు మరణంలో సుఖాన్ని కోరుకుంటారు. అంతిమ ఘడియల్లో ఆ స్వామిని స్మరించే అవకాశాన్ని కల్పించమంటూ ప్రార్ధన చేస్తారు. మరికొందరు ఆ పరమశివుడు కొలువుదీరిన క్షేత్రాలకే వెళ్లి అక్కడే చివరి శ్వాస విడవాలని అనుకుంటూ వుంటారు.

ఇలా శివతత్త్వం గ్రహించిన వారికి ముక్తిక్షేత్రంగా కనిపిస్తుంది 'పశుపతినాథ క్షేత్రం'. ఇది నేపాల్ దేశపు రాజధాని అయిన 'ఖాట్మండు' లో దర్శనమిస్తుంది. ఇక్కడి శివలింగం అయిదు ముఖాలను కలిగి వుంటుంది. స్వామివారికి ఎదురుగా కొలువుదీరిన భారీ నందీశ్వరుడు మనసును మంత్రిస్తాడు. భాగమతీ నదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రంలో, చైనా నిర్మాణ శైలిలో ఆలయం నిర్మించబడి వుంటుంది.

రెండు అంతస్తులు కలిగిన ఈ ఆలయం, బంగారపు పైకప్పుతో ... వెండి ద్వారాలతో దర్శనమిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో వందలాది శివలింగాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. ఇక శివయ్యతో పాటు ఇక్కడ అనేక మంది దేవతలకు మందిరాలు కనిపిస్తాయి. అందువలన ఇది ఒక ఆలయాల సముదాయంగా .. ఎప్పుడు చూసినా రద్దీగా అనిపిస్తూ వుంటుంది. ఎంతో మంది సిద్ధులు ... సాధువులు ఇక్కడ కనిపిస్తూ వుంటారు.

సామాన్య జీవితంలో కలగని ఆధ్యాత్మిక చింతన ఇక్కడ అడుగు పెట్టడంతోనే మొదలవుతుంది. ఏదీ శాశ్వితం కాదు ... ఎవరూ శాశ్వితం కాదు ... ఈ లోకం ... ఈ ప్రాణం ... ఇవన్నీ శివ ప్రసాదాలనే విషయం బోధపడుతుంది. మరణం వరకూ మనసులో నిలవమని ఆయనను వేలసార్లు వేడుకోవాలనిపిస్తుంది.


More Bhakti News