దైవనామ స్మరణ ఫలం

భగవంతుడు సర్వానికి యజమాని. అందరినీ నడిపించేది ... గెలిపించేది ఆయనే. దైవ నామాన్ని స్మరించడం వలన ... పలకడం వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పూర్వం చాలామంది తమ సంతానానికి దేవుడి పేర్లు పెట్టేవారు. కష్టాల్లో పడినప్పుడు ... ఆపదలు సంభవించినప్పుడు ... ఎవరైనా ఆ దేవుడినే తలచుకుంటూ వుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆయన కరుణ లభించాలంటే ముందునుంచే ఆయన నామాన్ని స్మరిస్తూ వుండాలి.
ఎప్పుడైనా ... ఎక్కడైనా .. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దైవ నామస్మరణ చేయవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఉత్తమ గతులు లభిస్తాయి. అయితే తన నామాన్ని జపించే భక్తులను మాత్రమే దైవం అనుగ్రహిస్తుందా అనే సందేహం అవసరంలేదు. ఏదో ఒక విధంగా ఆయనను తలచుకున్నా చాలు. ఇక దైవాన్ని నిందిస్తూ ఆ సందర్భంలో ఆయన నామాన్ని పలికి, ఆ నామ ఫలితంగా మోక్షాన్ని పొందినవారు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణగా మనకి శిశుపాలుడి ఉదంతం కనిపిస్తుంది.
శిశుపాలుడు శ్రీ కృష్ణుడిని తన శత్రువుగా భావించి, వీలైనన్ని సార్లు ఆయనను విమర్శించాడు ... నిందించాడు ... అవమానపరిచాడు. నూరు తప్పుల వరకూ అతనికి అవకాశం ఇచ్చిన శ్రీ కృష్ణుడు చివరి తప్పు చేయగానే సంహరించాడు. అలా ప్రాణాలు కోల్పోయిన శిశుపాలుడి కోసం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. కారణం ... ఆయన చివరి శ్వాస విడిచే వరకూ నిందా పూర్వకంగానైనా శ్రీ కృష్ణుడిని తలచుకోవడమే ... నిరంతరం ఆయన నామాన్ని పలుకుతూ ఉండటమే. భగవంతుడి నామానికి అంతటి విశిష్టత వుంది కనుకనే అనుక్షణం ఆయన నామాన్ని స్మరించాలి ... తన్మయత్వంతో తరించాలి.









