నవ గ్రహాలు

సూర్యుడు .. చంద్రుడు .. కుజుడు .. బుధుడు .. గురుడు .. శుక్రుడు .. శని ... రాహువు ... కేతువు, వీటిని నవగ్రహాలని అంటారు. ఈ నవ గ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో వాహనం వుంది. సూర్యుడు - ఏడు గుర్రాల రథం పై , చంద్రుడు - పది గుర్రాల రథం పై, కుజుడు - పొట్టేలుపై, బుధుడు - సర్పం పై, గురుడు - హంసపై, శుక్రుడు - కప్పపై, శని - గద్దపై, రాహువు - సింహం పై, కేతువు - డేగపై కనిపిస్తూ వుంటారు. ఆకాశంలో సంచరించే ఈ నవగ్రహాలు నేలపై నివసించే మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయనే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు చెప్పారు.

నవగ్రహాలు అత్యంత శక్తి వంతమైనవని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి నవగ్రహాలను శాంతింపజేయడం ద్వారానే వాటి అనుగ్రహాన్ని పొందవచ్చనే విషయాన్ని అవి స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆయా గ్రహాల అనుగ్రహం కోసం నవగ్రహ పూజలు ... ప్రదక్షిణలు ... హోమాలు చేస్తుంటారు. నవగ్రహాలను సంతృప్తి పరిచి శాంతింప జేయడం కోసం ఒక్కో గ్రహానికి ఒక్కో రోజున వాటికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం రోజున సూర్యుడికి నెయ్యితో కలిపిన గోధుమ పిండి .. సోమవారం రోజున చంద్రుడికి పెరుగు .. మంగళవారం రోజున కుజుడికి కందిపప్పు .. బుధవారం రోజున బుధుడికి పెసర పప్పు - నల్ల ఉలవలు .. గురువారం రోజున గురుడికి కొమ్ము శనగ పప్పు - మినప పప్పు .. శుక్రవారం రోజున శుక్రుడికి బొబ్బర్ల పప్పు .. శనివారం రోజున శనికి నువ్వులు .. రాహువుకి పూర్ణాలు .. కేతువుకి పచ్చి కూరగాయలతో కలిసిన భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలని శాస్త్రం చెబుతోంది.

గ్రహ దోషాల కారణంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం వుంది కాబట్టి, నవగ్రహాలను శాంతింప జేస్తూ వాటి అనుగ్రహంతో సాఫీగా జీవితాన్ని కొనసాగించడమే శ్రేయస్కరమని చెప్పవచ్చు.


More Bhakti News