భగవంతుడు చూపే కరుణ అలాంటిది

భగవంతుడు తనని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ వచ్చిన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాడు. తనని సేవించిన భక్తులకి భగవంతుడు సేవలు చేసిన సందర్భాలు వున్నాయి. తనే లోకం .. తనే సర్వం అనుకున్న భక్తులకు తన సన్నిధిలోనే చోటిచ్చిన కరుణా సాగరుడాయన.

అందుకే కొన్ని క్షేత్రాలకి వెళ్లినప్పుడు అక్కడ ప్రధానదైవంతో పాటు .. ఆయన ప్రాంగణంలోని ప్రత్యేక మందిరాలలో భక్తుల ప్రతిమలు కూడా పూజలు అందుకుంటూ వుంటాయి. అంతటి భాగ్యాన్ని పొందిన భక్తులలో 'పూంపావై' ఒకరుగా కనిపిస్తుంది. చెన్నై లోని 'కపాలీశ్వరస్వామి' క్షేత్రంలో ఆమె కథ వినిపిస్తుంది. ఈ పూంపావై మహా శివభక్తుడైనటు వంటి శివనేశన్ కూతురు. ఆమె ఆకస్మిక మరణం ఆ కుటుంబసభ్యులను కుంగదీస్తుంది.

శైవ భక్తులైన నాయనార్లలో ముఖ్యులుగా చెప్పబడే ముగ్గురిలో తిరుజ్ఞాన సంబంధర్ ఒకరు. ఆ గ్రామానికి వచ్చిన ఆయన విషయం తెలిసుకుని శివానుగ్రహంతో ఆమెని బతికిస్తాడు. శివుడు ప్రసాదించిన జీవాన్ని .. జీవితాన్ని ఆయన సేవకొరకే ధారపోయాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం చివరినిమిషం వరకూ ఆమె ఆ స్వామి సేవలోనే ఖర్చు చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకుంది.


More Bhakti News