హనుమంతుడి దర్శనమే చాలు

భగవంతుడిని భక్తుడిగా సేవిస్తూ .. తాను భగవంతుడిగా పూజించబడటమనేది హనుమంతుడి విషయంలోనే ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాంటి హనుమంతుడి జయంతిని వైశాఖ బహుళ దశమి రోజున ఘనంగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా వీరాంజనేయుడు .. భక్తాంజనేయుడు .. ప్రసన్నాంజనేయుడు .. అభయాంజనేయుడు .. దాసాంజనేయుడుగా ఆ స్వామి కొలువైన వివిధ క్షేత్రాలను భక్తులు దర్శించి పూజించి తరిస్తుంటారు.

కరీంనగర్ జిల్లా 'కొండగట్టు' ఆంజనేయస్వామి ఆలయం సుప్రసిద్ధమైనది. మహర్షుల కోరిక మేరకు వెలసిన స్వామి కావడం వలన ఇది మహిమాన్వితమైనది. పశ్చిమ గోదావరి జిల్లా మద్ది ఆంజనేయస్వామి ఆలయం కూడా విశిష్టమైనది. భక్తుడికి స్వామి సేవలు చేసిన వైనం ఈ క్షేత్రంలో వినిపిస్తుంది. హైదరాబాద్ లోని 'కర్మన్ ఘాట్' ఆంజనేయస్వామి ఆలయం చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది.

ఇక అనంతపురం జిల్లాలోని 'నెట్టికంటి ఆంజనేయస్వామి' ఆలయం .. కృష్ణా జిల్లా మాచవరంలోని దాసాంజనేయస్వామి ఆలయం వ్యాసరాయలవారి ప్రతిష్ఠగా అనేక విశేషాలతో వెలుగొందుతూ ఉంటాయి. చిత్తూరు జిల్లా అరగొండలోని 'అర్థగిరి ఆంజనేయస్వామి'కి గల స్థలమహాత్మ్యం గొప్పది. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఆకాశమార్గాన తీసుకుని వస్తుండగా, అందులోని ఒక భాగం ఇక్కడ పడిపోయిందని చెబుతారు.

ఇలా హనుమంతుడు నెలవైన అనేక క్షేత్రాలు వివిధ విశేషాలను .. మహిమలను సంతరించుకుని భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. హనుమజ్జయంతి రోజున ఆ స్వామికి ఆకుపూజ చేయించి, పానకం .. వడపప్పు .. వడలు .. మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఇలా ఆ స్వామికి ప్రీతిని కలిగించడం వలన సమస్త పాపాలు .. దుఃఖాలు నశించి, ఆయురారోగ్యాలు .. అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News