అదే గోమాత గొప్పతనం !

గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించడం వలన ... అంకితభావంతో సేవించడం వలన సమస్త దేవతలను ప్రత్యక్షంగా ఆరాధించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మహాతపోశక్తి కలిగిన మహర్షులకి సమానమైనదిగా గోవు చెప్పబడటం దాని గొప్పతనాన్ని చాటుతోంది. అందుకు సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది.

చ్యవనమహర్షి కొన్ని సంవత్సరాలుగా నదిలో తపస్సు చేస్తూ ఉండిపోతాడు. ఒకసారి చేపల కోసం జాలరులు విసిరిన వలలో చేపలతో పాటు ఆయన కూడా చిక్కుకుంటాడు. జరిగిన అపరాథాన్ని మన్నించవలసిందిగా ఆయనని జాలరులు కోరతారు. ఆయన ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించకుండా, చాలాకాలంగా నీటిలో ఉన్నందున తనని కూడా చేపగానే భావించి విక్రయించమని అంటాడు.

ఈ విషయంలో జాలరులు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోడు. ప్రభువైన 'నహుషుడు' వరకూ ఈ విషయం వెళ్లడంతో ఆయన చ్యవన మహర్షికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. దాంతో తనకి సమానమైన విలువ కలిగినది జాలరులకి ఇవ్వవలసినదిగా ఆయన నహుషుడిని కోరతాడు. అందుకు నహుషుడు సిద్ధపడతాడుగానీ, మహర్షితో సమానమైన విలువ కలిగినదేదో అర్థంకాక అయోమయానికి లోనవుతాడు.

ఈ విషయంగా ఆయన కవిజాతుడు అనే మహామునిని సంప్రదిస్తాడు. మహర్షికి సమానమైన విలువ కలిగినది గోవు మాత్రమేననీ, అందువలన జాలరులకు గోవును ఇవ్వమని ఆయన సూచిస్తాడు. ఆయన చెప్పినట్టుగానే నహుషుడు చ్యవన మహర్షికి బదులుగా జాలరులకు గోవును ఇస్తాడు. ఆ గోవును చ్యవన మహర్షికి దానం చేసిన జాలరులు అనేక దోషాల నుంచి బయటపడతారు. ఆ దాన ఫలితంగా ఉత్తమ గతులను పొందుతారు.


More Bhakti News