విష్ణు పూజ

శివపురాణం ... విష్ణుపురాణం వేరుగా అనిపించినా, శివకేశవులు వేరుగా కనిపించినా వాళ్లిద్దరికీ భేదం లేదనడంలో సందేహంలేదు. అయితే శ్రీహరిని పూజించడంలోను ... శివుడిని ఆరాధించడంలోను చాలాతేడా ఉందనే విషయాన్ని మాత్రం గమనించాలి. విష్ణువు అలంకారప్రియుడు ... తనకి జరిగే పూజాది కార్యక్రమాలు శుచిగా శుభ్రంగా జరగాలని కోరుకుంటాడు. ఇక శివుడు మాత్రం అభిషేకంతోను ... ఉమ్మెత్త పూలతోను సరిపెట్టుకుంటాడు.
వరాలు కురిపించడంలో కూడా సదాశివుడిలా విష్ణుమూర్తి ఉదారతను చూపించడు. పూజకు తగిన ఫలితాన్ని మాత్రమే ఆయన ప్రసాదిస్తాడు. ఇక ఈ విషయంలో శంకరుడు ఊహించని స్థాయిలో ఉదారాన్ని చూపించి బోళాశంకరుడనే పేరును ప్రతిసారి సార్ధకం చేసుకుంటూ ఉంటాడు. యజ్ఞ యాగాలు నియమ నిష్టలతో చేయని కారణంగానే 'ధృఢమతి'అనే భక్తుడిని శ్రీహరి కరుణించలేదు. ఆ విషయం తెలుసుకున్న ఆ భక్తుడు శుచి శుభ్రతలు పాటించకుండా తాను మూటగట్టుకున్న పాపాన్ని కడిగి వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తిరుమలలోని జలధారల్లో ధృఢమతి స్నానమాచరించి పునీతుడయ్యాడు. అప్పుడు గాని ఆయనను శ్రీ మహావిష్ణువు అనుగ్రహించలేదు. ఈ కారణంగానే తిరుమల కొండలపై నుంచి దూకే జలధారలకి పాపనాశనం అనే పేరు వచ్చింది. కాబట్టి శ్రీ మహావిష్ణువును పూజించేటప్పుడు మరింత పవిత్రతను ... పరిశుభ్రతను కలిగి ఉండాలనే విషయాన్ని మరిచిపోకూడదు.









