ప్రాచీన ఆలయాలను కాపాడుకోవాలి

పురాణపరమైన నేపథ్యం ... చారిత్రక పరమైన వైభవం అనే రెండు కళ్లతో ప్రాచీన ఆలయాలు కనిపిస్తూ వుంటాయి. ఫలానా వారు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారట. స్వామివారి మహాత్మ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న ఓ భక్తుడు ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించాడట. అనే మాటలను వింటున్నప్పుడు, ఆ ఆలయాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతుంటుంది.

ఇక అక్కడి దైవాన్ని ప్రత్యక్షంగా చూడవలసిందేనని కొన్ని క్షేత్రాలకి వెళ్లిన వాళ్లు అప్పుడప్పుడు ఆవేదనతో తిరుగుముఖం పడుతుంటారు. తాము దర్శించాలనుకున్న దైవాన్ని ... గుప్తనిధుల పేరుతో దొంగలు భిన్నం చేశారని తెలియడమే అందుకు కారణం. ఈ జాబితాలో 'రేపాల' లోని రామలింగేశ్వరస్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం పరిధిలో 'రేపాల'వుంది.

ఇక్కడి నరసింహస్వామి క్షేత్రం సమీపంలోనే 'రామలింగేశ్వర ఆలయం'కనిపిస్తుంది. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ద్రాక్షారామంలో భీమేశ్వరుడిని ప్రతిష్టించిన ముహూర్తనికే ఇక్కడి శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు చెప్పబడుతోంది. శ్వేత వర్ణంలో గల ఆ శివలింగం దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ ఉండేదట. కొంతకాలం క్రిందట గుప్తనిధులను ఆశించి కొందరు దుండగులు ఆ శివలింగాన్ని భిన్నం చేసినట్టు చెబుతున్నారు. దాంతో ఖాళీగా కనిపించే ఇక్కడి గర్భాలయం భక్తుల మనసును భారం చేస్తుంది.

గుప్తనిధులు ఉన్నాయని ఊహించుకుని వాటిని అన్వేషించేవారి సంఖ్య పెరిగిపోతూ ఉండటం నిజంగా విచారించవలసిన విషయం. పగిలిపోయింది రాతి విగ్రహం ... కూలిపోయింది పాత మంటపమే కదా అని ఆలోచించకూడదు. వాటి వెనుక పురాణపరమైన విశేషాలు ... చరిత్రకు సంబంధించిన వివరాలు దాగి ఉంటాయనే విషయాన్ని మరిచిపోకూడదు. ఒకనాటి మతపరమైన దాడుల తరువాత మిగిలిన ప్రాచీన క్షేత్రాలను అపురూపమైనవిగా భావించి వాటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా వుంది.

ప్రాచీన ఆలయాల భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలని వదిలివేయకుండా, వాటిని కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండవలసిన బాధ్యత స్థానికులపై కూడా వుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంతో భావితరాల అనుబంధం కొనసాగాలంటే, ప్రతి ఒక్కరూ ప్రాచీన ఆలయాల పరిరక్షణకు అంకితభావంతో కృషిచేయవలసిన అవసరం ఎంతైనా వుంది.


More Bhakti News