కాలం అనుకూలించకపోతే అంతే !

కాలం అనుకూలిస్తే బంటు ... రాజు అవుతాడు. అదే కాలం ఎదురు తిరిగితే, రాజు కాస్తా బంటు అవుతాడు. ఎంతటి మేథావులైనా ... పండితులైనా ... పరాక్రమవంతులైనా కాలం అనుకూలించినంతవరకే వారి ప్రతిభ రాణిస్తుంది ... వారి ప్రభావం కొనసాగుతుంది. కాలం ప్రతికూలిస్తే సన్మానాలకి బదులుగా అవమానాలు ఎదురవుతూ వుంటాయి. ఆనందానికి బదులుగా ఆవేదన దగ్గరవుతూ వుంటుంది.

ఇందుకు నిదర్శనంగా ఎంతోమంది జీవితాలు కనిపిస్తూ వుంటాయి. 'అల' వచ్చినప్పుడే 'తల' వంచుకుపోవాలి అనే నానుడిని విశ్వసిస్తూ వాళ్లంతా ముందుకుసాగారు. కాలం కలిసిరాగానే తమ పూర్వ వైభవాన్ని పొందారు. అలాంటివారిలో ఒకడుగా 'నలమహారాజు' కనిపిస్తాడు. కాలం ప్రతికూలంగా మారడంతో, ఆయన ఒంటరివాడిగా మిగిలిపోతాడు. తన రూపాన్ని తానే గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆయన రుతుపర్ణుడి రాజ్యానికి చేరుకుంటాడు.

రుతుపర్ణుడు సభ తీర్చిన సమయంలో అక్కడికి వస్తాడు. తన పేరు బాహుకుడంటూ .. గతంలో తాను నలమహారాజు దగ్గర పనిచేశానని చెబుతాడు. వంట బాగా చేయగలననీ ... గుర్రాలను బాగా నడపగలనని చెబుతాడు. వీలైతే తనని అందుకు సంబంధించిన పనిలో పెట్టుకోవలసినదిగా కోరతాడు. నలమహారాజు రాజ్యాన్ని వదిలి వెళ్లడంతో తాను ఆశ్రయాన్ని కోల్పోయాననీ, ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో ఉపాధి ఎంతో అవసరమని చెబుతాడు.

రుతుపర్ణుడు మంచి భోజన ప్రియుడు ... రథంపై వేగంగా ప్రయాణించడం అంటే ఆయనకి మహా సరదా. అందుకని ఆయన వెంటనే అంగీకరిస్తాడు. బాహుకుడు ఆనందంతో పొంగిపోతూ ఆ రోజునే అక్కడి పనిలో చేరతాడు. అలా మహారాజుగా ఒక వెలుగు వెలిగిన నలుడు మరో రాజు దగ్గర పనివాడిగా చేరతాడు. అందుకే విధి అనేది వింత నాటకం ఆడుతుందని అంటారు ... విధి రాతను విష్ణువు సైతం తప్పించుకోలేడని చెబుతుంటారు.


More Bhakti News