ఆర్తితో పిలిస్తే ఆ క్షణమే వచ్చే బాబా

శిరిడీలో బాబా అడుగుపెట్టిన దగ్గర నుంచి బాయజాబాయి ఆయనని ఎంతో ప్రేమతో ఆదరిస్తూ వస్తుంది. బాబాను చూడకుండా ఆమె ఒక్కరోజు కూడా వుండేది కాదు ... ఆయనకి పెట్టకుండా తాను ఏమీ తినేది కాదు. ఈ నేపథ్యంలోనే ఆమె కొడుకైన తాత్యాకి బాబాతో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బాయజాబాయి అనారోగ్యానికి గురవుతుంది.
ఇక తాను చనిపోయే సమయం ఆసన్నమైందనే విషయం బాయజాబాయికి తెలిసిపోతుంది. కన్నుమూసేలోగా ఆమెకి ఒక్కసారి బాబాను చూడాలనిపిస్తుంది. తన శరీరం సహకరించదని తెలిసికూడా ఆమె మంచం పైనుంచి లేవడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. బాబా కోసం తల్లిపడే ఆరాటం చూస్తూ తాత్యా ఏడుస్తూ వుంటాడు. శరీరం ఎంత మాత్రం సహకరించపోవడంతో ''బాబా'' అంటూ ఒక్కసారిగా ఆమె మంచంలో కుప్పకూలిపోతుంది. ఆ మాటతో పాటుగానే బాబా అక్కడ ప్రత్యక్షమవుతాడు.
ఆయన్ని చూసి ఆమె ఆనందంతో పొంగిపోతుంది. ఆయన సేవలో తన జన్మ తరించిందని చెబుతుంది. ఆమె తాత్యా గురించి ఆందోళన చెందుతోందని తెలిసి, తాను వుండగా తాత్యా గురించి భయపడవలసిన పనిలేదని బాబా ధైర్యం చెబుతాడు. బాయజాబాయి నోట్లో తులసి తీర్థం పోసి ఆమెకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా తన భక్తురాలి చివరి కోరిక తీర్చిన సాయి, ఆమెకి ఇచ్చిన మాట మేరకు తన చివరి క్షణం వరకూ తాత్యాను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. భక్తుల కుటుంబాలతో బాబా ఎంతటి అనుబంధాన్ని కలిగివుంటాడో, వాళ్ల కోసం ఆయన ఎలాంటి త్యాగాలను చేస్తాడో చెప్పడానికి బాయజాబాయితో బాబాకి గల బంధమే నిదర్శనమని చెప్పవచ్చు.









