బలమైన విశ్వాసమే బాధలను తీరుస్తుంది !

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి అంచెలంచలుగా ఎదుగుతాడు. ఆయన కుటుంబసభ్యులు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని కొనసాగించసాగారు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యాపారికి అనూహ్యమైన పరిస్థితులు ఎదురుకాసాగాయి. వ్యాపారంలో వరుసగా వస్తోన్న నష్టాలు ఆయనని ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. ఆ నష్టాలను తట్టుకునే శక్తిలేని కారణంగా ఆయన తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు.
భర్త పరిస్థితి భార్యకి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించిన ఆమె, దత్తాత్రేయ స్వామికి మొక్కు చెల్లించకపోవడమే జరిగిన అనర్థానికి కారణమని గ్రహిస్తుంది. వ్యాపారంలో పైకి వస్తే దత్త క్షేత్రంలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తానని చెప్పిన ఆమె భర్త, ఆ తరువాత ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ఈ విషయం గుర్తుకు రావడంతో, ఆ వ్యాపారి భార్య ఆ మొక్కు చెల్లించాలని నిర్ణయించుకుంటుంది.
భర్త అనుకున్న స్థాయిలో మొక్కుచెల్లించే శక్తి తన ఒక్కదానికి లేదని గ్రహించిన ఆమె, దత్తాత్రేయస్వామి అవతారమైన 'అక్కల్ కోటస్వామి' కి భోజనం పెడితే ఆ మొక్కు తీరినట్టు అవుతుందని విశ్వసిస్తుంది. అనుకున్నదే తడవుగా ఆమె అక్కల్ కోటకు చేరుకుని, ఆ స్వామికి వివిధ రకాల పదార్థాలతో భోజనం పెడుతుంది. ఆమె ఎంతో ప్రేమతో వండి తెచ్చిన భోజన పదార్థాలను ఆయన ఇష్టంగా ... సంతృప్తిగా ఆరగిస్తాడు.
దత్తాత్రేయుడికి చెల్లించవలసిన మొక్కు తీరిపోయిందనీ, ఇక దాని గురించి చింతించవలసిన పనిలేదని ఆమెతో అంటాడు స్వామి. తాను చెప్పకపోయినా స్వామి అలా మాట్లాడటంతో, ఆమె ఆశ్చర్యపోతుంది. సాక్షాత్తు దత్తాత్రేయస్వామి అవతారమే శ్రీ అక్కల్ కోట స్వామి అని తాను విశ్వసించినందుకు, తగిన నిదర్శనం లభించిందని ఆమె సంతోషంతో పొంగిపోతుంది. ఆనంద బాష్పాలు వర్షిస్తూ వుండగా స్వామి పాదాలపై పడి నమస్కరిస్తుంది.









