మహాదేవుడి మాయ ఇలాగే ఉంటుంది !

03-05-2014 Sat 08:16

అసూయ ... ద్వేషాలు పండితులను కూడా వివేకం కోల్పోయేలా చేస్తుంటాయి. అప్పటి వరకూ గౌరవ సన్మానాలు పొందిన పండితులు సైతం, కొద్దిపాటి అసూయ కారణంగా నలుగురిలో అవమానం పాలైన సంఘటనలు చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. అసలైన పండితులను అవమానపరచడానికి అసూయపరులైన పండితులు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టడంలో భగవంతుడు ప్రదర్శించిన లీలలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి.

మహాకవి కాళిదాసు జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం' రచించి, దానిని ఓ పెట్టెలో భద్రపరిచి భోజరాజు ఆస్థానానికి తీసుకువస్తాడు. అదే ఆస్థానానికి చెందిన ఓ పండితుడు కాళిదాసుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటాడు. ఆ కావ్యాన్ని అపహరించి దానిని తానే రచించినట్టు చెప్పాలనుకుంటాడు.

ఆయన పథకం ప్రకారం శిష్యులు ఆ కావ్యాన్ని అపహరించి, రాజు ఆగ్రహానికి కాళిదాసు గురికావాలనే ఉద్దేశంతో ఆ పెట్టెలో చేపలు ఉంచుతారు. భోజరాజు ఆస్థానానికి చేరుకున్న తరువాత, అక్కడి పండితుల ప్రవర్తన చూసి కాళిదాసుకి అనుమానం వస్తుంది. తన దగ్గర గల పెట్టె తెరిచి చూసిన ఆయన అందులో కావ్యానికి బదులుగా చేపలు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. జరిగింది గ్రహించిన ఆయన, ఆ పరమేశ్వరుడిని మనసులోనే తలచుకుంటాడు.

అంతే మూడో కంటికి తెలియకుండా, కాళిదాసు రచించిన కావ్యం ఆయన పెట్టెలోకి వచ్చేస్తుంది. చేపలు ఎవరైతే పెట్టారో అవి వాళ్ల పెట్టెలోకే చేరతాయి. ఈ విషయం తెలియని ఆ పండితుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, రాజు ఆగ్రహానికి గురై నలుగురిలో అవమానం పాలవుతాడు. పరమశివుడి లీలా విశేషాన్ని మనసులోనే అభినందించిన కాళిదాసు, అసూయ ద్వేషాలు ప్రతిభావంతులను సైతం పెడదోవ పట్టిస్తాయనీ ... వాటిని దూరంగా ఉంచినప్పుడే ఆ ప్రతిభ కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెడుతుందని ఆ పండితుడి కళ్లు తెరిపిస్తాడు.


More Bhakti Articles