స్థల మహాత్మ్యం అంటే ఇదే !

స్థలానికి కూడా మహిమ ఉంటుందనీ ... అది ఆ ప్రదేశానికి చేరుకున్నవారిని ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ప్రాచీనకాలం నుంచి విశ్వసించడం జరుగుతోంది. ఈ రోజుల్లో కూడా ఎవరిలోనైనా హఠాత్తుగా మార్పు కనిపించినప్పుడు ''ఏం చేస్తాం ... స్థల మహిమ '' అనడం జరుగుతూ వుంటుంది. పురాణాల్లోను ... ఇతిహాసాలలోను స్థల మహాత్యానికి సంబంధించిన సంఘటనలు కనిపిస్తుంటాయి.
ఎప్పుడూ వినయ విధేయతలతో కనిపించే లక్ష్మణుడు ఒకసారి కాస్త అసహనంగా కనిపించడం చూసిన సీతాదేవి, ఆ విషయాన్ని రాముడి దగ్గర ప్రస్తావిస్తుంది. అది స్థల మహాత్మ్యమనీ ... ఆ ప్రదేశాన్ని దాటితే ఎప్పటిలానే ఉంటాడని రాముడు సమాధానమిచ్చాడట. అలాగే తన తల్లిదండ్రులను కావడిలో కూర్చుండ బెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లే శ్రవణకుమారుడు, ఒకానొక ప్రదేశానికి చేరుకోగానే ఇక వాళ్లను భరించడం తన వల్ల కాదని చెప్పేస్తాడు. అది స్థల ప్రభావమని గ్రహించిన ఒక మహర్షి వెంటనే వాళ్లని అక్కడి నుంచి తీసుకువెళతాడు.
ఇలా చెడు ప్రభావాన్ని చూపే ప్రదేశాలే కాదు, మంచి ప్రభావాన్ని చూపే స్థలాలు కూడా ఉంటాయనే విషయాన్ని అనేక సంఘటనలు నిరూపిస్తూ వుంటాయి. అలాంటి వాటిలో 'దేవరకోట' ఒకటి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కి సమీపంలో గల ఈ ప్రదేశం మహిమాన్వితమైనదని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్మును, ఆలయ నిర్మాణానికి ఖర్చు చేసిన గోపన్నను బంధించి తీసుకురమ్మని నిమ్మలనాయుడు అనే అధికారిని గోల్కొండ నవాబు ఆదేశించాడు.
ఆవేశంతో బయలుదేరిన ఆయన ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా ప్రశాంతత ఆవరిస్తుంది. శ్రీరామచంద్రుడి భక్తుడిని బంధించడం అపరాథమనే ఆలోచన కలుగుతుంది. తన ఆలోచనా విధానం ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే మారిపోవాడాన్ని గమనించిన ఆయన, ఆ స్థలం అత్యంత మహిమాన్వితమైనదిగా ... పవిత్రమైనదిగా భావిస్తాడు. అక్కడ శిధిలావస్థలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వెలుగులోకి తీసుకువస్తాడు. ఆనాటి నుంచి తన జీవితాన్ని భక్తి మార్గంలో కొనసాగిస్తాడు.









