కళ్లు తెరిపించిన సాయిబాబా

బాబా మంచితనం ... మానవత్వం శిరిడీ ప్రజలను కట్టిపడేస్తాయి. దాంతో అనుక్షణం వాళ్లు ఆయన దగ్గరేవుంటూ ఆయన సేవలు చేసుకోసాగారు. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసి బాబా తలదాచుకునే మశీదును బాగుచేయడానికి సిద్ధపడతారు. వాళ్లు మశీదును బాగుచేస్తూ వుండగా, బాబాకి దాహమవుతుంది. ఆ విషయం చెప్పగానే అక్కడున్న వారిలో ముగ్గురు వ్యక్తులు ఆయనకి మంచినీళ్లు తీసుకువస్తారు.
బాబా ఒకరి చేతిలోగల మంచినీళ్లు అందుకుని తాగుతాడు. దాంతో మిగతా ఇద్దరూ చిన్నబుచ్చుకుంటారు. ఆ వ్యక్తి తెచ్చిన మంచినీళ్లు తాగాడు గనుక ఆయన మతమంటేనే బాబాకి ఇష్టమని అంటారు. అందువల్లనే తాము తెచ్చిన మంచినీళ్లు స్వీకరించలేదంటూ ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఆ మాటలు బాబాను ఎంతగానో బాధిస్తాయి.
దాంతో ఆయన ఒక పాత్రను తెప్పించి ఆ మూడు మతాలవారు తెచ్చిన నీళ్లను ఆ పాత్రలో కలుపుతాడు. ఇప్పుడు మతాల వారిగా ఎవరి నీళ్లను వాళ్లు వేరుచేసి తనకి ఇవ్వమని అడుగుతాడు. ఆ మాటకి వాళ్లంతా బిత్తరపోతారు. అదెలా సాధ్యమవుతుందంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తారు. పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న నీళ్లకు కూడా మతాలను ఆపాదించవద్దని బాబా అంటాడు. రూపాలు వేరైనా దేవుడు ఒక్కడేననీ ... కులమతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని చెబుతాడు.
కులమతాలు మనుషులు తమ స్వార్థం కోసం సృష్టించినవనీ, వాటిని కూలదోయడం వల్లనే అందరూ సుఖసంతోషాలతో ఉండగలుగుతారని అంటాడు. అంతా ఒక్కటే అనే సమభావనే అనంతమైన ఆనందాన్ని ఇస్తుందనీ, దానిని పొందడానికి ప్రయత్నించమని చెబుతాడు. బాబా దృష్టిలో అందరూ సమానమేననీ, తన భక్తుల నుంచి కూడా తాను ఆ స్వభావాన్ని ఆశిస్తున్నానని అంటాడు. ఆ రోజు నుంచి ఆయా కులమతాలకి సంబంధించిన ఆయన భక్తులు మరింత సఖ్యతగా వుండటం మొదలుపెడతారు.









