భక్తుల బాధలు తీర్చే పవిత్ర క్షేత్రం

భగవంతుడి మనసు గెలుచుకోవడానికీ...ఆయన సన్నిధిని చేరుకోవడానికి నవవిధ భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. ఈ మార్గాల్లో ప్రయాణం చేసిన వాళ్లంతా మహా భక్తులుగా చెప్పబడ్డారు. సాధారణ భక్తులు మాత్రం తమ కుటుంబ క్షేమాన్ని కోరుతూ దైవాన్ని ప్రార్ధిస్తూ వుంటారు. తమ బాధలను విన్నవించుకుంటూ, వాటిని తీర్చవలసిన భారాన్ని ఆయనపై వేస్తుంటారు.

అలా భక్తులు చెప్పుకునే బాధలను సావధానంగా ఆలకించి, వారికి ఆ కష్టాల నుంచి విముక్తిని కలిగించే స్వామి మనకి ఏలూరు పరిధిలో గల 'శనివారపు పేట' లో కనిపిస్తాడు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో ప్రధాన దైవంగా 'చెన్నకేశవస్వామి' పూజలు అందుకుంటున్నాడు. పూర్వం నూజివీడు నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన జమీందారు అప్పారావు గారు ఇక్కడ దివాణం నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.

ఆ సమయంలోనే ఒకనాటి రాత్రి ఆయనకి స్వప్నంలో స్వామివారు కనిపించాడు. తన ధృవమూర్తి అక్కడి బావిలో ఉందనీ, దానిని బయటికి తీసి నూతనంగా ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని ఆదేశించాడట. మరునాడు ఉదయాన్నే అప్పారావుగారు తన ప్రయత్నాన్ని ప్రారంభించగా, బావిలో నుంచి స్వామివారి మూర్తి బయటపడింది. ఆ విగ్రహానికి ఆయన ఆలయాన్ని నిర్మించి, నిత్య దీప .. ధూప .. నైవేద్యాలకి ఏర్పాటు చేశాడు.

కాలక్రమంలో ఆయన వారసులు ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచారు. సువిశాలమైన ప్రాంగణంలో భారీ నిర్మాణాలతో కనిపించే ఈ ఆలయం ఆనాటి వైభవానికి అద్దంపడుతూ వుంటుంది. ఆలయ ప్రాకారాలపై ... గోపురంపై రామాయణ..భారత.. భాగవత దృశ్యాలు అద్భుతంగా మలచబడ్డాయి. ఇక ఈ శిల్పకళా వైభవం చూస్తే, ఆలయ నిర్మాణం పట్ల అప్పారావు...ఆయన కుటుంబసభ్యులు ఎంతటి అంకితభావాన్ని కలిగివున్నారనేది స్పష్టమవుతుంది.

గర్భాలయంలో స్వామివారు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంటాడు. సమస్యలతో తన సన్నిధికి వచ్చిన వారిని అనుగ్రహిస్తుంటాడు. స్వామి దర్శనమాత్రం చేతనే కష్టాలు మటుమాయం అవుతాయని చెబుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఉత్సవాల సమయంలో స్వామివారి వైభవం చూసితీరవలసిందేగానీ, మనసంతా ఆవరించే ఆ అనుభూతిని గురించి చెప్పడానికి మాటలుచాలవు.


More Bhakti News